గంధడ గుడి: ఇదీ మోడీ మార్క్ ప్రచారం..
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'గంధడ గుడి' అక్టోబర్ 28న విడుదల కానుంది. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ ఆ మూవీ విజయవంతం కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రచారానికి కాదేదీ అనర్హం అన్న రీతిలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని తాను ప్రచారంలో ఉండేలా చేసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతనే ఎవరైనా అనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. అంబులెన్స్ లకు దారి ఇవ్వడం, సభకు ఆలశ్యమైందంటూ మోకాళ్ళపై కూర్చుని ప్రజలకు క్షమాపణలు చెప్పడం వంటి పనులన్నీ దీనిలో భాగమే. తాజాగా ఆయన దివంగత నటుడు పునీత్ రాజకుమార్ నటించిన చివరి చిత్రం గంధడ గుడి విజయవంతం కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో వచ్చేయేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బిజెపి నేతలందరూ ఏ చిన్న విషయాన్నీ వదలకుండా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు.
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్‌లో 46 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. అతని ఆకస్మిక మరణం యావత్ జాతిని విషాదంలో ముంచెత్తింది. అతని చివరి చిత్రం గంధడ గుడి, కర్ణాటకలోని వన్యప్రాణులను అన్వేషించే డాక్యుడ్రామా. పునీత్ మొదటి వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 28న సినిమాల్లో విడుదల కానుంది.
గంధడ గుడి ట్రైలర్‌ను ఆదివారంనాడు పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ విడుదల చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ ప్రత్యేక పోస్ట్‌లో ఆమె ట్రైలర్‌ను షేర్ చేసింది. ఆమె ట్వీట్ చేస్తూ, "నమస్తే నరేంద్రమోడీ, ఈ రోజు మాకు ఎమోషనల్ డే. అప్పూ హృదయానికి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ గంధదగుడి యొక్క ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాము. అప్పు ఎప్పుడూ మీతో గడిపిన సమయాన్ని ఎంతో ఆదరంగా భావిస్తూంటాడు. మీతో వ్యక్తిగతంగా విషయాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. " అని పేర్కొన్నారు. ఈ జంట మోడీతో పోజులిచ్చిన ఫోటోను కూడా షేర్ చేస్తూ, అశ్విని ఇలా వ్రాశారు, "అప్పు మన మధ్యలో లేడు, కానీ అతని జీవితం, చేసిన పనులు 'వసుధైకా కుటుంబం' సంస్కృతిని స్వీకరించడానికి మాకు ప్రేరణను, శక్తిని ఇస్తుంది. #GGMovie సినిమా మన భూమి గొప్ప వారసత్వం, సంస్కృతి, స్వభావం, వైవిధ్యానికి అద్దం పట్టింది."
అని పేర్కొంది.
ప్రధానమంత్రి ఆమెకు సమాధానమిస్తూ, దివంగత నటుడిని అద్భుతమైన, గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిగా అభివర్ణిస్తూ మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి శుభాకాంక్షలు పంపారు, "అప్పు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాలలో నిలిచి ఉంటారు. అతను తెలివైన వ్యక్తి, శక్తి, అసమాన ప్రతిభ కలిగిన్న వ్యక్తి. గంధడగుడి ప్రకృతి మాతకు, కర్ణాటక ప్రకృతి సౌందర్యానికి ,పర్యావరణ పరిరక్షణకు నివాళి. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు." అంటూ ప్రధాని సందేశం పంపారు.