Telugu Global
National

గ‌డ్క‌రీ పై వేటు త‌ప్ప‌దా..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ని పక్కకు తప్పించాలని మోడీ టీం ఆలోచిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఆయన తన స్వంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న విషయం తెలిసిందే.

గ‌డ్క‌రీ పై వేటు త‌ప్ప‌దా..?
X

బిజెపి మాజీ అధ్యక్షుడు, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి సంబంధించి దేశ‌ రాజ‌ధాని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తికర చర్చ‌ జ‌రుగుతోంది. ఇటీవ‌లే నితిన్ గ‌డ్క‌రీని బిజెపి పార్ల‌మెంట‌రీ బోర్డునుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే. గ‌డ్క‌రీకి ఆర్ఎస్ఎస్ మ‌ద్ద‌తు ఉంద‌ని అంతా భావిస్తుంటారు. అయితే తాజాగా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో ఆయ‌నకు ప్రాధాన్యం త‌గ్గిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఒక‌వేళ‌ గ‌డ్క‌రీ తోక జాడిస్తే ఆయ‌న్ను కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి కూడా తొల‌గిస్తార‌ని లేదా క‌నీసం శాఖ‌ను మార్చి అప్రాధాన్య మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌డ్క‌రీపై వేటు ప‌డ‌నుందా ?

కేంద్ర మంత్రివర్గం నుండి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్‌ల రాజీనామాల కారణంగా ఖాళీలు ఏర్ప‌డ్డాయి. త్వరలో జరగబోయే పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ‌డ్క‌రీ శాఖ మార్పు ఖాయ‌మ‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. పార్టీ అత్యున్న‌త నిర్ణాయ‌క మండ‌లి నుంచి పాత వారినంద‌ర్నీతొల‌గించి కొత్త వారితో ప‌నిచేయాల‌ని ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది.

ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో కూడా, 2014 నుండి కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఇంకా పదవిలో కొన‌సాగుతున్నారు. మరికొందరు కొంత కాలం జూనియర్ మంత్రులుగా పనిచేసిన తర్వాత పదోన్నతి పొందారు. 2014 నుండి కొనసాగిన నలుగురు కేంద్ర మంత్రుల‌లో రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ కంటే నరేంద్ర సింగ్ తోమర్, స్మృతి ఇరానీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

2014లో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత గ‌డ్క‌రి మొద‌ట రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, ఆ త‌ర్వాత కొంద‌రు రాజీనామాలు, గోపీనాథ్ ముండే మరణం కారణంగా - నీటి వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్ర‌క్షాళ‌న శాఖ‌ల బాధ్య‌త‌ల‌ను అద‌నంగా నిర్వ‌హిస్తున్నారు. కొన్ని నెలలపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను కూడా ఆయనే చూసుకున్నారు. కానీ 2019 తర్వాత రోడ్డు ర‌వాణా, ర‌హ‌దార్ల శాఖ‌ త‌ప్ప మిగిలిన శాఖ‌లేవీ ఆయ‌న వ‌ద్ద లేవు. త‌న బాద్య‌త‌ల‌ నిర్వ‌హ‌ణ‌లో గ‌డ్క‌రీ అత్యంత స‌మ‌ర్దుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఆరోప‌ణ‌ల ప్ర‌భావం..

ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఆస‌క్తిక‌రంగా ఉంటున్నాయి. రాజ‌కీయ నైతిక‌సూత్రాల‌ను పాటించే ఏకైక బిజెపి నాయ‌కుడిన‌ని త‌న‌కు తాను ప్రొజెక్టు చేసుకుంటున్నార‌నే వాద‌న విన‌బ‌డుతోంది. అలాగే పార్టీ నాయ‌క‌త్వాన్ని అప‌హాస్యం చేసేలా ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు ఉన్నాయ‌ని అంటున్నారు.

గత నెలాఖ‌రులో నాగ్‌పూర్‌లో రాష్ట్ర శాసన మండలి మాజీ సభ్యుడి సన్మాన స‌భ‌లో పలువురు ఆర్‌ఎస్‌ఎస్ పెద్దల సమక్షంలో గడ్కరీ మాట్లాడుతూ "నేను రాజకీయాల నుంచి ఎప్పుడు వైదొలగాలని చాలా ఆలోచించాను. జీవితంలో రాజకీయాల కంటే విలువైనవి చాలా ఉన్నాయి. అన్నారు. దాని గురించి వివరిస్తూ, "రాజకీయం అనే పదానికి అర్థం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాలు సామాజిక సేవ‌, దేశ నిర్మాణం, అభ్యుదయం... ఇవ‌న్నీ అధికారం క్రీడ‌లో భాగమా ?" అని ప్ర‌శ్నించారు.

ప్రస్తుత రాజకీయాలు అధికారాన్ని సంపాదించడం,దానిని ఉపయోగించుకోవడం మాత్రమే అని గడ్కరీ వ్యాఖ్య‌లు ఉన్నాయంటూ ఢిల్లీ లోని ఓ వ‌ర్గం భాష్యం చెబుతోంది. ప్ర‌స్తుతం రాజకీయాలు వైరుధ్యాలు, బలవంతాలు, పరిమితులతో కూడిన ఒక ఆట మాత్రమేనని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని గడ్కరీ అన్నారు. వాళ్లు చెప్పినట్లు రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అన్నారు. గ‌డ్క‌రీ ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న ప‌ద‌విలో ఉండ‌లేర‌నే సూచిస్తున్నాయంటున్నారు.

"సమయం చాలా అమూల్య‌మైన‌ది. ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే అతిపెద్ద సమస్య'' అని పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించిన తర్వాత గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న క‌త్తి మీద సాము చేసేందుకే సిద్ధ‌మ‌వుతున్నార‌నిపిస్తుంది. తనపై చర్యలు తీసుకునేలా పార్టీ నాయకత్వాన్ని, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై బహిరంగంగా విమ‌ర్శ‌లు చేసేందుకు ఎందుకు ధైర్యం చేస్తున్నార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో విప‌క్షాలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) తో పాటు ప్రాంతీయ పార్టీలు బ‌ల‌ప‌డుతున్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. అలాగే, బిహార్ లో నితీష్ కుమార్ బిజెపికి షాకిస్తూ ఆర్ఝెడీ. కాంగ్రెస్ పార్టీల‌తో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

గ‌త కొంత కాలంగా ఆర్ఎస్ఎస్, బిజెపి లోని ఒక వ‌ర్గంలో మోడీ పాల‌నా వ్య‌వ‌హారాల‌పై అసంతృప్తి వ్య‌క్త అవుతోంది. రానున్న కాలంలో నాట‌కీయ మ‌లుపులు సంభ‌వించ‌వ‌చ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంతకుముందు కూడా ఇలాంటి వాద‌న‌లే వినిపించాయి. 2018లోనూ, 2019 తొలినాళ్ళ‌లో ఈ ఎన్నికలపై ఎన్నో ఊహాగానాల్లో ఊరేగారు. అయితే బీజేపీకి, మిత్ర‌ప‌క్షాల‌కు ఆశించినంత‌గా ఫ‌లితం రాలేదు.

కోవిడ్ రెండో వేవ్ సంద‌ర్భంలో మోడీ ప్ర‌భుత్వం స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తిరిగి అధికారంలోకి వ‌చ్చింది.

2009- 2013 మధ్య గడ్కరీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మోడీ ఢిల్లీలో పార్టీ నాయ‌కుల చుట్టూ తిరిగే వారు. 2014లో, మోడీ ప్రధాని అయ్యాక ఢిల్లీకి వెళ్లినప్పుడు, వ్యవస్థను ఎలా నడిపించాలో తెలిసిన వ్యక్తుల మద్దతు అవసరం ప‌డింది. అటువంటి వారిలో గడ్కరీ ఒకరు.

తాను స్వంతంగా నిల‌దొక్కుకున్న త‌ర్వాత గడ్కరీ వంటి నాయకుడి అవసరం తీరిపోయింది. అవసరాల ఆధారంగా న‌డిచే సంబంధాలపై మోడీకి గట్టి నమ్మకం ఉంది. తన స్వంత మంత్రిత్వ శాఖ వ్యవహారాలను నిర్వహించడంలో గ‌డ్క‌రీ త‌ప్పనిస‌రిగా ఉండాల‌ని మోడీ భావించినంత కాలం మాత్ర‌మే ఆయ‌న మంత్రివర్గంలో ఉండ‌గ‌ల‌రు.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను నిర్వహించడంపై మోదీకి నమ్మకం క‌లిగిన‌ప్పుడు గ‌డ్క‌రీకి ఉద్వాస‌న త‌ప్ప‌దంటున్నారు. అయితే ఈ ప‌రిణామాలు గ‌డ్క‌రీకి పెద్ద‌గా ఆశ్చ‌ర్యం క‌లిగించ‌వు. ఒక‌ప్పుడు ఏదో స‌మ‌యంలో మంత్రులుగా ప‌నిచేస్తున్న 69 మంది నాయ‌కులు 2014లో మోడి హ‌యాం ప్రారంభ‌మైన త‌ర్వాత ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువ‌ల్ల గ‌డ్క‌రీ కూడా ఎటువంటి ప‌రిణామాలు ఎదుర్కొన‌డానికైనా సిద్ధంగానే ఉన్నారు.

First Published:  29 Aug 2022 8:28 PM IST
Next Story