Telugu Global
National

నేటి నుంచే జీ20 సదస్సు.. ఢిల్లీ చేరుకున్న దేశాధినేతలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. శుక్రవారమే వీరంతా ఢిల్లీ చేరుకోగా.. భారత ప్రభుత్వం వారిని సాదరంగా ఆహ్వానించింది.

నేటి నుంచే జీ20 సదస్సు.. ఢిల్లీ చేరుకున్న దేశాధినేతలు
X

ప్రపంచంలోని ప్రభావవంతమైన దేశాల కూటమి జీ20..శిఖరాగ్ర సమావేశాలు నేటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన భారత్ మండపంలో రెండు రోజుల పాటు అత్యంత కట్టుదిద్దమైన భద్రత మధ్య ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఇండియా తొలి సారిగా అధ్యక్ష హోదాలో జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నది. ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే జీ20 సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి. దక్షిణార్ధ గోళ దేశాల ఆందోళనలు, రష్యా-ఉక్రెయిన్ యుద్దంతో నెలకొన్న దారుల పరిస్థితులు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థకు పరిష్కారం చూపుతూ.. ఈ సదస్సును కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా ప్రపంచ దేశాల అధినేతలు జీ20 సదస్సు కోసం శుక్రవారమే ఢిల్లీ చేరుకోగా.. భారత ప్రభుత్వం వారిని ఘనంగా ఆహ్వానించింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి వీరందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. చైనా, రష్యా అమెరికాతో విభేదిస్తున్న వేళ.. సదస్సులో డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఇక జీ20 సదస్సుకు ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అతిథులకు ఘన స్వాగతం పలకడం దగ్గర నుంచి సదస్సు ముగిసే వరకు పూర్తి విజయవంతం చేయడానికి ప్రభుత్వ ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సు ద్వారా మానవాళి కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధికి కొత్త దారి వేస్తామని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. వసుదైక కుటుంబం పేరుతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్ నినాదంగా భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోందది. భారత్ అధ్యక్ష పాత్రలో సమ్మిళిత వృద్ధి, డిజిటల్ ఆవిష్కరణ, వాతావరణ మార్పలు, అందరికీ సమాన ఆరోగ్య విషయాలు అనే ప్రతిపాదనలు చేయనున్నది.

ఇక ఈ సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 సభ్యత్వం, అంతర్జాతీయ రుణ వితరణ పునర్వవస్థీకరణ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణ వితరణ, క్రిప్టో కరెన్సీ నియంత్రణ వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు. జీ20 దేశాలైన ఇండియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ పాల్గొంటుండగా.. అధ్యక్ష హోదాలో ఇండియా.. బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్ దేశాలను ఆహ్వానించింది.

First Published:  9 Sept 2023 5:31 AM IST
Next Story