ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్..4 రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఫెంగల్ తుఫాన్ వాయుగుండంగా బలహీనపడటంతో నాలుగు రాష్ట్రాలు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి.
ఫెంగల్ తుఫాన్ వాయుగుండంగా బలహీనపడటంతో నాలుగు రాష్ట్రాలు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమ, కోస్తాలో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడులో తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుప్పురం, కడలూరుతో పాటు పుదుచ్చేరికి ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో ఏపీలోని తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం తలకోన జలపాతం వద్ద కూడా కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి తలకోన జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది.
నెల్లూరు, చిత్తూరు. వైఎస్ఆర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలో కొన్ని జిల్లాలో తుఫాన్ ప్రభావం కనబడుతుంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులోని విల్లుప్పురం జిల్లాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. అక్కడ 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, సుమారు 1500 మందిని తరలించారు.