అవయవ దాతలకు అరుదైన గౌరవం ఎక్కడంటే…
అవయవ దానం చేసిన వారి త్యాగాన్ని గౌరవిస్తూ వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
అవయవదానాన్ని ప్రోత్సహించే దిశగా తమిళనాడు సర్కారు ఆదర్శప్రాయమైన నిర్ణయాన్ని తీసుకుంది. అవయవ దానం చేసినవారికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అవయవ దానంలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ సందర్భంగా స్టాలిన్ పేర్కొన్నారు.
మనం మట్టిలో కలిసిపోకముందే మన అవయవాలను మరికొందరికి దానం చేసి ప్రాణం పోయవచ్చు. ఒక్క మనిషి పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చు. అవయవదానంపై సరైన అవగాహన లేకపోవడం కారణంగా.. ఏ కారణంగా చనిపోయినా మనం మట్టిలో కలిసిపోతున్నామే కానీ, మరొకరి జీవితాన్ని నిలపవచ్చని ఆలోచించడం లేదు. కానీ అవయవదాన ప్రక్రియ ద్వారా వందలాదిమంది రోగులకు కొత్త జీవితాన్ని అందిస్తుంది. అందుకే తమ అవయవాలను దానం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారి త్యాగాలను పురస్కరించుకుని మరణానికి ముందు అవయవ దాతల అంత్యక్రియల విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బాధాకరమైన పరిస్థితుల్లో తమ ఆత్మీయులను కోల్పోయినా సరే వారి అవయవాలను దానం చేయటం ద్వారా ఎంతోమందికి కొత్త జీవితాలను అందించినవారి నిస్వార్థ త్యాగాల వల్లే తమిళనాడు అవయవ దానంలో అగ్రస్థానంలో నిలిచిందని స్టాలిన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అవయవ దానం చేసిన వారి త్యాగాన్ని గౌరవిస్తూ వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అవయవదానం చేసే రోగుల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే 2022 సంవత్సరానికి దేశంలో సుమారు 16 వందల ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు జరుగగా అత్యధిక అవయవ దానాలు తెలంగాణ రాష్ట్రంలో నమోదు అయ్యాయి. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో గతేడాది 194 అవయవ దానాలు జరిగాయి. ఆ తర్వాత 154 అవయవదానంతో తమిళనాడు రెండో స్థానంలోనూ కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
*