Telugu Global
National

భావ ప్రకటనా స్వేచ్ఛ బాధ పెట్టకూడదు.. - మద్రాస్‌ హైకోర్టు

మిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్బంగా ఓ కాలేజీ ‘Oppose To Sanathana’ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలు కోరుతూ జారీచేసిన సర్క్యులర్‌ను హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.

భావ ప్రకటనా స్వేచ్ఛ బాధ పెట్టకూడదు.. - మద్రాస్‌ హైకోర్టు
X

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని, అది ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉండకూడదని హితవుపలికింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్బంగా ఓ కాలేజీ ‘Oppose To Sanathana’ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలు కోరుతూ జారీచేసిన సర్క్యులర్‌ను హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్‌. శేషసాయి.. సనాతన ధర్మం అంశం చుట్టూ జరుగుతున్న చర్చపై ఆందోళన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం కేవలం కులతత్వాన్ని, అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనన్న భావన బలపడిందన్నారు. ఆ భావనను తీవ్రంగా వ్యతిరేకస్తున్నట్టు తెలిపారు.

"అంటరానితనం అమానుషమైంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17లో అంటరానితనాన్ని నిర్మూలించినట్లు ప్రకటించిన కారణంగా ఇక దేశంలో దానికి స్థానం లేదు. అలాగే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. అయితే అది విద్వేషపూరితంగా మారకూడదు. ముఖ్యంగా మతపరమైన అంశాలకు సంబంధించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది" అన్నారు.

అలాగే ‘సనాతన ధర్మం అనేది నిరంతర విధుల సముదాయమని తెలిపారు. దేశం పట్ల కర్తవ్యం, పాలకుల పట్ల కర్తవ్యం, రాజు తన ప్రజల పట్ల కర్తవ్యం, తల్లిదండ్రులు, గురువుల పట్ల కర్తవ్యం, పేదల సంరక్షణ, మొత్తం ఇతర విధులే సనాతన ధర్మం అని అన్నారు. సనాతన ధర్మానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తీవ్రమైన చర్చ జరుగుతోందని, ఈ విషయంలో న్యాయస్థానం ఎటువంటి సహాయం చేయలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

మతపరమైన ఆచారాలు కాలానుగుణంగా మారుతున్నప్పుడు తెలియకుండానే కొన్ని చెడ్డ ఆచారాలు ప్రవేశించి ఉండచ్చు. అవి తొలగించాల్సిన కలుపు మొక్కలు. కానీ, మొత్తం పంటనే ఎందుకు పూర్తిగా కోసేయాలి?’ అని వ్యాఖ్యానించారు.

First Published:  16 Sept 2023 4:47 PM GMT
Next Story