Telugu Global
National

ఉచిత చీరల కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి

వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా తరలివస్తారని నిర్వాహకులు ఊహించలేదు. టోకెన్ల కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు మహిళలు మృతిచెందగా, పదిమంది మహిళలు గాయపడ్డారు.

ఉచిత చీరల కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి
X

తమిళనాడులో ఓ ప్రైవేట్ కంపెనీ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలుసుకున్న జనం భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడీ ప్రాంతంలో మురుగన్ తైపూసం ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని ఓ ప్రైవేట్ కంపెనీ ప్రకటించింది. ముందుగా టోకెన్లు అందజేస్తామని, ఆ టోకెన్లు తీసుకొని వచ్చిన వారికి చీరలు తర్వాత అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

కాగా, ఇవాళ ఆ ప్రైవేట్ కంపెనీ టోకెన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టింది. ఉచితంగా చీరలు తీసుకోవచ్చని ప్రజలు వేలాదిగా టోకెన్లు పంపిణీ చేస్తున్న ప్రాంతానికి వచ్చారు. వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా తరలివస్తారని నిర్వాహకులు ఊహించలేదు. టోకెన్ల కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు మహిళలు మృతిచెందగా, పదిమంది మహిళలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

చీరల టోకెన్ల కోసం ప్రజలు వేలాదిగా వస్తారని సదరు కంపెనీ అంచనా వేయలేకపోవడమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. టోకెన్లు పంపిణీ చేస్తున్న ప్రాంతం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రజలంతా ఒక్కసారిగా టోకెన్ల కోసం ముందుకు దూసుకురావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత నెల గుంటూరులో కూడా ఉచిత చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలుసుకొని అక్కడికి మహిళలు భారీ సంఖ్యలో రాగా తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందారు.

First Published:  4 Feb 2023 9:12 PM IST
Next Story