Telugu Global
National

భారత్‌లో 4 మంకీపాక్స్ కేసులు.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో కలిపి 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు.

Monkeypox cases in india
X

మంకీ పాక్స్ కేసులు భారత్‌ని వణికించేలా ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ సోకినట్టు ప్రభుత్వం నిర్ధారించింది. అయితే ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడు విదేశాలకు వెళ్లలేదు, కానీ మంకీపాక్స్ సోకింది. సో.. ఇతనికి వైరస్ ఎవరి ద్వారా అంటుకుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ అలా వైరస్ కి వాహకులుగా మారినవారు ఇంకెంతమందికి అంటించారో తేలాల్సి ఉంది. వారంతా ప్రస్తుతం ఢిల్లీలో సైలెంట్ క్యారియర్లుగా ఉన్నారా అనేది ఆందోళన కలిగించే అంశం.

కరోనా లాగే మంకీపాక్స్ వైరస్ కూడా విదేశాలనుంచి వస్తుందనే ప్రచారం ఉంది. భారత్ లో తొలిసారిగా కేరళకు చెందిన ముగ్గురికి మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారించారు. అయితే ఆ ముగ్గురూ విదేశీ ప్రయాణాలు చేసి వచ్చినవారే. దీంతో విదేశాలనుంచి వచ్చినవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. కానీ ఢిల్లీలో మంకీపాక్స్ సోకిన 34 ఏళ్ల వ్యక్తి ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. జ్వరం, చర్మంపై దద్దుర్లతో బాధపడుతున్న అతడికి మంకీపాక్స్ సోకినట్టుగా అనుమానించిన అధికారులు, శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత అతడిని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కేరళలో ముగ్గురు, ఢిల్లీలో ఒకరు.. భారత్ మొత్తంలో ఇప్పటి వరకు నలుగురికి మంకీపాక్స్ సోకింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో కలిపి 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రపంచ దేశాల్లో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. మంకీపాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

First Published:  24 July 2022 9:00 AM GMT
Next Story