బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇకలేరు
సీపీఎం పొలిట్‌బ్యూరోలో కీలకంగా వ్యవహరించిన బుద్ధదేవ్.. సుదీర్ఘకాలం పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (80) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో గురువారం ఉదయం కన్నుమూశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం ఈ విషయం వెల్లడించారు. బుద్ధదేవ్‌కు భార్య, కుమారుడు సుచేతన్ ఉన్నారు. ఆయన 2000–2011 మధ్య పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
సీపీఎం పొలిట్‌బ్యూరోలో కీలకంగా వ్యవహరించిన బుద్ధదేవ్.. సుదీర్ఘకాలం పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2011లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో పార్టీ అధికారాన్ని కోల్పోయింది. పశ్చిమబెంగాల్‌లో 34 సంవత్సరాల పాటు సాగిన కమ్యూనిస్టుల పాలనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టి 2011లో అధికారం దక్కించుకుంది.
అధికారం కోల్పోయిన తర్వాత బుద్ధదేవ్ క్రమంగా ప్రజా జీవితం నుంచి దూరమయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. చూపు మందగించింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. బుద్ధదేవ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ పూర్వ విద్యార్థి. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందువరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1977లో తొలిసారి కాశిపుర్–బెల్గాచియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన బుద్ధదేవ్.. జ్యోతిబసు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2001, 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. బాలీగంజ్‌లోని చిన్న ఇంట్లోనే ఆయన నివసించేవారు. సీఎంగానూ అక్కడి నుంచే విధులు నిర్వర్తించారు. అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. ఇప్పుడు అక్కడే తుదిశ్వాస విడిచారు.