Telugu Global
National

నిద్రలేవండి, బెడ్ కాఫీ తాగండి.. కేంద్రానికి చిదంబరం చురక..

ఇంధన ధరలే ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని అంటున్న చిదంబరం, భారీగా పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులను ఆకర్షించాలని, కరెంటు ఖాతా లోటును కట్టడి చేయాలని చెప్పారు.

నిద్రలేవండి, బెడ్ కాఫీ తాగండి.. కేంద్రానికి చిదంబరం చురక..
X

జనం: రూపాయి విలువ పడిపోతోంది

కేంద్రం: పక్క దేశాలది కూడా అదే పరిస్థితి

జనం: నిత్యావసరాల రేట్లు పెరిగిపోతున్నాయి..

కేంద్రం: అది మా తప్పు కాదు, ఉక్రెయిన్ లో యుద్ధం వచ్చింది..

జనం: నిరుద్యోగం పెరిగిపోయింది, ఉద్యోగాల్లేవు.

కేంద్రం: కరోనా వచ్చింది, మా చేతుల్లో ఏమీ లేదు..

ఇలా ఉంది భారత్ లో పరిస్థితి. చేతగాని, చేవలేని కేంద్ర ప్రభుత్వం ప్రతి సమస్యనీ పక్కదారి పట్టిస్తోంది, కారణాలు వెదికిపెట్టుకుంటోంది. కనీసం సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఒకరకంగా చెప్పాలంటే ప్రజలు కష్టపడుతుంటే, కేంద్రం మొద్దునిద్రపోతోంది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం నిద్ర మేల్కొనాలని, కాఫీ వాసన చూడాలని చురకలంటించారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబ‌రం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే.. భారత వృద్ధి అంచనాలు మరింత దిగజారతాయని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై కేంద్రం మాత్రమే సంతోషంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఏం చేయాలి..? ఏం చేస్తున్నారు..?

యూపీఏ పాలనలో.. 2012, 2013 సమయంలో కూడా రూపాయి పతనం వేగంగా జరిగిందని, కానీ ఆ పతనానికి అడ్డుకట్ట వేసే చర్యలు అప్పటి తమ ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు చిదంబరం. కానీ ఇప్పుడు రూపాయి నేలచూపు చూస్తున్నా.. ఇతర దేశాల కరెన్సీలను పోలికగా చెబుతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇలాంటి పోలికలు కట్టిపెట్టాలని, ముందు దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలని మండిపడ్డారు చిదంబరం.

రూపాయి పతనం, జీడీపీ వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం.. వీటన్నిటికీ ఉక్రెయిన్ సంక్షోభం కారణమని కేంద్రం సమర్థించుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇలాంటి కారణాలు చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా..? మీరంతా ప్రభుత్వంలో ఎందుకు ఉన్నారంటూ నిలదీశారాయన. అంతర్జాతీయ పరిణామాలతో పాటు, అంతర్గత సమస్యలు కూడా పరిష్కరించాలని సూచించారు. ఇంధన ధరలే ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని అంటున్న చిదంబరం, భారీగా పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులను ఆకర్షించాలని, కరెంటు ఖాతా లోటును కట్టడి చేయాలని చెప్పారు.

First Published:  8 Oct 2022 8:26 AM IST
Next Story