కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామగారు
కోడలి ఒంటరితనాన్ని చూసి తట్టుకోలేకపోయిన నవీన్ నంద ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని భావించారు. ఆమెకు తండ్రిగా మారి మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
పెళ్లయిన కొద్దిరోజులకే కొడుకు చనిపోవడంతో కోడలికి తండ్రిగా మారి మళ్లీ పెళ్లి చేసిన మామగారి వైనమిది. ఆయన మాజీ ఎమ్మెల్యే కావడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆయన పేరు నవీన్ నంద.. ఆయన ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో గల గందియ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఇటీవల తన పెద్ద కుమారుడు సంబిత్‌కి వివాహం చేశారు. అయితే కొద్ది రోజులకే జరిగిన ఓ ప్రమాదంలో అతని కుమారుడు మృతిచెందాడు. సంబిత్ మృతిచెందాక కోడలు అత్తవారింట్లోనే ఉంటోంది.
కోడలి ఒంటరితనాన్ని చూసి తట్టుకోలేకపోయిన నవీన్ నంద ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని భావించారు. ఆమెకు తండ్రిగా మారి మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం కోడలికి, కుటుంబ సభ్యులకు వివరించి.. వారికి నచ్చజెప్పారు.
మంగళవారం భువనేశ్వర్‌లోని నయాపల్లి లక్ష్మీ ఆలయంలో ఆమెకు వివాహం చేశారు. పెళ్లి చిత్రాలను నవీన్ నంద సోషల్ మీడియాలో పెట్టి.. `నేను తప్పు చేశానో.. మంచి చేశానో నాకు తెలియదు. నా పెద్ద కుమారుడు చనిపోయాడు. అతని భార్య మాతోనే ఉంది. ఆమెకు ఒక తోడు అవసరం అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను` అని వ్యాఖ్యలు జత చేశారు. `కోడలిగా మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు కుమార్తె అయింది` అని ఆనందం వ్యక్తం చేశారు.