Telugu Global
National

కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత

కాంగ్రెస్‌లో సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఊమెన్.. ఆ తర్వాత తన పని తీరుతో పార్టీ అధిష్టానానికి విశ్వాస పాత్రుడిగా మారారు.

కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
X

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రెండు సార్లు కేరళకు సీఎంగా వ్యవహరించిన ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 79 ఏళ్ల ఊమెన్ చాందీ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు గతంలో గొంతు సంబంధిత సమస్యలు రావడంతో కేరళలోని ఆసుపత్రిలో చేరారు. అయితే ఉత్తమ చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో కొంత కాలం నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్టు పెట్టారు.

ఊమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమర‌కోమ్ గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్‌లో సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఊమెన్.. ఆ తర్వాత తన పని తీరుతో పార్టీ అధిష్టానానికి విశ్వాస పాత్రుడిగా మారారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తొలి సారి 1970లో కొట్టాయం జిల్లా పూతుపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏనాడూ వెనుదిరిగి చూసుకోవల్సి అవసరం రాలేదు. అదే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

1977లో కే.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2006 వరకు, 2011 నుంచి 2016 వరకు రెండు సార్లు కేరళకు సీఎంగా పని చేశారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ పార్టీ మారని నాయకుడిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఊమెన్ చాందీకి భార్య మరియమ్మ, పిల్లలు మరియా ఊమెన్, చాందీ ఊమెన్, అచ్చు ఊమెన్ ఉన్నారు. చాందీ మరణం పట్ల కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్ సంతాపం వ్యక్తం చేశారు. లెజండరీ లీడర్ ఊమెన్ చాందీ మరణ తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆయన పేర్కొన్నారు.

కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అసెంబ్లీకి తొలి సారిగా తాము ఒకే సమయంలో ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తు చేసుకుననారు. ఇద్దరం కూడా విద్యార్థి సంఘాల నుంచే రాజకీయాల్లో ఎదిగినట్లు పేర్కొన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుల్లో ఊమెన్ చాందీ ఒకరని సీఎం విజయన్ తెలిపారు.



First Published:  18 July 2023 7:48 AM IST
Next Story