పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీ
ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పిస్తుందని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో పురోగతి, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది.
పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులుంటారు. దీనికి ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నట్టు సమాచారం. కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కె.రామమూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఐఐటీ ఢిల్లీ డీన్ (విద్యార్థి వ్యవహారాలు) ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్, కేంద్ర విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పిస్తుందని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో పురోగతి, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. ప్రవేశ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దీంతో పాటు కేంద్రం తాజాగా ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా తీవ్రమైన శిక్షలు విధించేలా దీనిని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం నిందితులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశముంది.