తెలంగాణలోనే కాదు, పుదుచ్చేరిలోనూ తమిళిసై పై విమర్శలు..
తమిళిసై రాజకీయాలు చేయాలనుకుంటే పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం నారాయణ స్వామి. పార్టీ రాజకీయాలపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారాయన.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు కొనితెచ్చుకున్న గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సెప్టెంబర్ 17 గురించి విలీనం కాదు, విమోచనం అంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అటు కమ్యూనిస్ట్ లు కూడా తమిళిసైకి రాజకీయాలెందుకంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం తెలంగాణలోనే కాదు, లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పుదుచ్చేరిలో కూడా ఆమెపై సదభిప్రాయం లేదు. పుదుచ్చేరి రాజకీయాల్లో తమిళిసై ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి.
రాహుల్ యాత్రపై కామెంట్స్..
రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్నవారు రాజకీయాల జోలికి రాకూడదు. ఒకవేళ రాజకీయాలే ఇష్టమనుకుంటే, ఆ పదవికి రాజీనామా చేసి అప్పుడు ప్రజా క్షేత్రంలో తమ సత్తా నిరూపించుకోవాలి. కానీ తమిళిసై తెలంగాణ గవర్నర్ గా ఉంటూనే ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అటు పుదుచ్చేరికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై తమిళిసై సౌందర రాజన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ హఠాత్తుగా నిద్రమేలుకున్నారా అని ప్రశ్నించారామె. ఈ వ్యాఖ్యలపై పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళిసై రాజకీయాలు చేయాలనుకుంటే పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం నారాయణ స్వామి. పార్టీ రాజకీయాలపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారాయన.
మీ ఫోకస్ ఇక్కడెందుకు..?
తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై ని అక్కడి ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోవడంలేదని, అందుకే ఆమె ఎక్కువ సమయం పుదుచ్చేరిలో గడుపుతున్నారని ఎద్దేవా చేశారు నారాయణ స్వామి. ఆమె తెలంగాణకు గవర్నర్ అని, పుదుచ్చేరి కోసం కేవలం అదనపు బాధ్యతలు మాత్రమే చేపట్టారని గుర్తు చేశారు. పుదుచ్చేరిలో ఫ్రెంచ్ పౌరులకు చెందిన ఇళ్లను సంఘ వ్యతిరేక శక్తులు టార్గెట్ చేయడం ప్రారంభించాయని అన్నారు నారాయణ స్వామి. ఫ్రెంచ్ పౌరుల ఆస్తులను లాక్కునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై కి చిత్తశుద్ధి ఉంటే.. ఫ్రాన్స్ లో నివసిస్తున్న పుదుచ్చేరి మూలాలకు చెందిన ప్రజల ఆస్తులను పరిరక్షించాలని కోరారు.