నేతలపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక ఆదేశాలు
కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
దేశంలో చట్టసభల్లో ఉన్న సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు.. హైకోర్టులకు అప్పగించింది. ఇందుకోసం ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. మరో 6 నెలల్లో లోక్‌సభ ఎన్నికల వస్తుండటంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి.
దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తెలిపారు. అయితే రాజకీయ నేతలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయడానికి కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించడం క్లిష్టమైన ప్రక్రియగా భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు పలు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ట్రయల్ కోర్టులు అత్యవసరం అనుకుంటే తప్ప రాజకీయ నేతలపై కేసుల విచారణను వాయిదా వేయకూడదు. అలాగే క్రిమినల్ కేసుల్లో రాజకీయ నేతల విచారణ స్థితిగతులపై నివేదికల కోసం హైకోర్టులు ప్రత్యేక దిగువ కోర్టులను పిలవవచ్చు. అంతేకాదు కేసుల వివరాలు, విచారణలో ఉన్న అంశాలకు సంబంధించిన వివరాలను జిల్లా, ప్రత్యేక కోర్టుల నుంచి సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో విడిగా పొందుపరచాలని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీలను జిల్లా కోర్టులే ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇవన్నీ జరిగి ఆ రాజకీయ నేతలు దోషులుగా తేలితే వారిపై జీవితకాల నిషేధం విధించడంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వివిధ హైకోర్టులు అందజేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ కేసుల వివరాల ప్రకారం.. 2022 నవంబర్ నాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,377 కేసులు ఉండగా, తర్వాత స్థానంలో బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలున్నాయి.