రేపిస్టులకు సన్మానాలు .. సామాజిక కార్యకర్తలకు జైళ్ళు
దేశంలో జరుగుతున్న కొన్ని ఉదంతాలు న్యాయవ్యవస్థ పట్ల సందేహాలు కలిగించే విధంగా ఉంటున్నాయి. రేపిస్టులను జైళ్ళనుంచి విడుదల చేయడం, అన్యాయాన్ని ప్రశ్నించే సామాజిక కార్యకర్తలను జైళ్ళకు పంపడం అనేక విమర్షలకు కారణమవుతున్నాయి.
కోర్టులంటే బాధితులను ఆదుకునే ఆపన్నహస్తాలుగా ఉండాలి.. న్యాయవ్యవస్థ పక్షపాతానికీ, వివక్షకీ అన్నింటికీ అతీతం.. కానీ జరుగుతున్న కొన్ని ఉదంతాలు కోర్టు తీర్పుల పట్ల సందేహాలు కలిగించేవిగా ఉంటున్నాయన్న అభిప్రాయాలకు తావిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇటీవల బిల్కిస్ బానో కేసులో 11 మంది రేపిస్టుల విడుదలే నిదర్శనం. దీనిపై దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలే తార్కాణం. వారి రిలీజ్ న్యాయవ్యవస్థ పట్ల నమ్మకానికి తూట్లు పొడిచింది. ఇదే జుడీషియరీ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తోందన్నది అంతు చిక్కని ప్రశ్న. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో బాధితుల పక్షాన పోరాడడమే ఆమె చేసిన నేరమా ? ఈ కేసులో సిట్ తీరును ప్రశ్నించడమే ఆమె తప్పిదమా ? ఆ నాటి అల్లర్లలో కుట్రకు పాల్పడ్డారని, సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి యత్నించారని ..ఇలా ఎన్నో ఆరోపణలతో సిట్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇప్పటికే బెయిల్ కోసం రెండు సార్లు యత్నించిన ఆమె ఇంకా అహ్మదాబాద్ లోని శబర్మతి సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారు.ఈ కేసులో ఈమెతో బాటు గుజరాత్ మాజీ డీజీపీ బి.శ్రీకుమార్ కూడా నిందితులని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏ.ఎం. ఖన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఇటీవల అభిప్రాయపడింది.
నాడు హత్యకు గురైన కాంగ్రెస్ నేత ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన అప్పీలును ఆ బెంచ్ కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి తీస్తా సెతల్వాద్ కో-పిటిషనర్ గా ఉన్నారు. ప్రధాని మోడీకి ఈ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సెతల్వాద్ ప్రశ్నించారు. ఈమెతో బాటు శ్రీకుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏ ఉత్తర్వులిస్తుందన్నది తెలియడంలేదు. గుజరాత్ మారణకాండ కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సహా సుప్రీంకోర్టు 'తప్పొప్పులను' కూడా మేధావులు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. . విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన 11 మంది అకాడమీషియన్లు ఇటీవల విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటన చూస్తే.. మన జుడిషియరీనే సందేహించవలసి వస్తుంది.
భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్య ఇచ్చిన కొన్ని తీర్పుల పట్ల వీరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ తీర్పులు భవిష్యత్తులో ఇండియాలో పౌర, మానవహక్కులపై నేరుగా ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోధ్రా ఘటన అనంతరం జరిగిన అల్లర్లలో మొదట గుజరాత్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. దీనిపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. కానీ ఈ అప్పీలును సుప్రీంకోర్టు కొట్టివేసిందని .. కానీ . ఇది సమంజసం కాదని విద్యావేత్తలు పేర్కొన్నారు. పైగా పిటిషనర్లకు తప్పుడు ఉద్దేశాలను కోర్టు ఆపాదించిందన్నారు. ఎగ్జిక్యూటివ్ (ఇక్కడ సిట్) నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గానీ, ఇతర కారణాలు చెప్పి గానీ కోర్టులకెక్కేవారిని న్యాయస్థానాలు ప్రోత్సహించవని, వారు సమస్యను సదా 'మరుగుతూ ఉండేలా' చూస్తారని న్యాయమూర్తులు పేర్కొనడం ఖండించదగినదని ఈ సంయుక్త ప్రకటన విచారం వ్యక్తం చేసింది అసలు పిటిషనర్ల వాదననే కోర్టు ఆలకించలేదని, ఇది న్యాయవ్యవస్థకే దురదృష్టకరమని వారన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇఛ్చిన తీర్పులోని కొన్ని పదాలను తొలగించాలని, పిటిషనర్లపై పెట్టిన కేసులను కొట్టివేయాలని విద్యావేత్తలు డిమాండ్ చేశారు. తీస్తా సెతల్వాద్, శ్రీకుమార్ లకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు.
ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేసినవారిలో బ్రిటిష్ పొలిటికల్ థియరిస్ట్ భికూ పరేఖ్, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు అమెరికన్ లింగ్విస్ట్, ఫిలాసఫర్ , సోషల్ క్రిటిక్, పొలిటికల్ యాక్టివిస్ట్ నోమ్ చోమ్ స్కీ, ఇండియన్-అమెరికన్ ఆంత్రోపాలజిస్ట్ అర్జున్ అప్పాదురై, అమెరికన్ పొలిటికల్ థియరిస్ట్ వెండీ బ్రౌన్,ఎం కెనడియన్ ఫిలాసఫర్ చార్లెస్ టేలర్ తదితరులున్నారు. బిల్కిస్ బానో కేసులో 11 మంది రేపిస్టుల విడుదలపై దేశమంతా భగ్గుమంటున్న వేళ.. తీస్తా సెతల్వాద్, శ్రీకుమార్ ల బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. నిరపరాధులు ఓ వైపు జైల్లో మగ్గుతుంటే మరోవైపు ఇలాంటి రేపిస్టులను విడుదల చేయడమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. నిందితులకు గుజరాత్ ప్రభుత్వ క్షమాభిక్ష ఉత్తర్వులను నీతికా విశ్వనాథన్ అనే ప్రముఖ లాయర్ ప్రశ్నిస్తూ.. ఈ కేసులో కొందరు నిందితులు లోగడ సాక్షులను, బాధితులను బెదిరించారని అన్నారు. 11 మంది రేపిస్టుల రిలీజ్.ని యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ ఖండిస్తూ..ఇది అర్థరహితమైనది, తప్పుడు ఉత్తర్వులని అభివర్ణించింది.