Telugu Global
National

గోధుమ నిల్వల్లో అలసత్వం.. దిగుమతులకు చేయిచాచే దైన్యం..

తొలిసారిగా ఎన్డీఏ హయాంలో గోధుమలను దిగుమతి చేసుకునే దౌర్భాగ్య స్థితికి చేరుకుంటోంది. దీన్ని ఎన్డీఏ తమ గొప్పతనంగా చెప్పుకుంటుందా, కనీసం చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం అయినా చేస్తుందా అనేది అనుమానమే.

గోధుమ నిల్వల్లో అలసత్వం.. దిగుమతులకు చేయిచాచే దైన్యం..
X

దేశవ్యాప్తంగా గోధుమల ధరలు రికార్డుస్థాయిలో పెరిగాయి. ఇక్కడ రైతులకు పెద్దగా గిట్టుబాటి కాకపోయినా ధరాఘాతంతో సామాన్యుడు విలవిల్లాడిపోయాడు. ఈ పాపమంతా కేంద్రానిదే. ఇప్పుడు ఆ పాపానికి మరో ప్రతిఫలం అనుభవించాల్సి వస్తోంది. ప్రపంచ దేశాలకు గోధుమలు ఎగుమతి చేసిన భారత్.. తొలిసారిగా ఎన్డీఏ హయాంలో గోధుమలను దిగుమతి చేసుకునే దౌర్భాగ్య స్థితికి చేరుకుంటోంది. దీన్ని ఎన్డీఏ తమ గొప్పతనంగా చెప్పుకుంటుందా, కనీసం చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం అయినా చేస్తుందా అనేది అనుమానమే.

మోదీ ప్రగల్భాలు ఇప్పుడేమయ్యాయి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా పలు దేశాల్లో ఆహార సంక్షోభం నెలకొన్న సందర్భంలో ప్రపంచానికి ఆహారాన్నందిస్తామంటూ భారత ప్రధాని గంభీరంగా ప్రకటించారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు మన దేశంలో గోధుమల కొరత వచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ముందు చూపులేని బీజేపీ ప్రభుత్వమే దీనికి కారణం అనేది నిపుణుల మాట. గోధుమల నిల్వల విషయంలోనూ అలసత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. గతేడాది ఉత్తరాదిలో వడగాల్పులు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గోధుమ ఉత్పత్తి భారీగా తగ్గింది. 111 మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి అవుతాయని అనుకున్నా, అది 102 మిలియన్ టన్నుల దగ్గరే ఆగిపోయింది. దీంతో బ్లాక్ మార్కెట్ పెరిగింది. రేట్లు పెరగడంతో విదేశాలకు ఎగుమతులను ఆపేశారు. ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. చివరకు గోధుమ నిల్వలు కరిగిపోయి, రేట్లు భారీగా పెరిగిన తర్వాత ఎగుమతులు నిషేధించారు. కానీ ఫలితం లేదు.

కేంద్రం మేకపోతు గాంభీర్యం..

వ్యాపారుల వద్ద ఉన్న గోధుమల నిల్వలపై కేంద్రం పరిమితులు విధించింది. ఆ పరిస్థితి ఉత్పన్నం అయిందంటే.. నిల్వలు లేవు, దిగుమతులకు రెడీ అవుతున్నామని అర్థం. కానీ కేంద్రం మాత్రం గోధుమ దిగుమతిపై వచ్చిన వార్తలను ఖండించింది. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఆమధ్య తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరణకు మొండికేసిన కేంద్రం, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వరి ధాన్యం సేకరణకు సిద్ధమైంది. గోధుమల విషయంలో కూడా ముందుచూపు లేకుండా వ్యవహరించి ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది.

First Published:  22 Aug 2022 8:44 AM IST
Next Story