Telugu Global
National

అదానీపై ప్రేమతో... సముద్రపు ఇసుక మైనింగ్ పై బ్యాన్ ఎత్తేయనున్న మోడీ సర్కార్

బీచ్ సాండ్ మైనింగ్ ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు చేయడం దేశభద్రతకు ముప్పంటూ 2019లో బ్యాన్ చేసింది మోడీ సర్కార్. ఇప్పుడు అదానీ కోసం ఆ బ్యాన్ ఎత్తేయబోతోంది అదే సర్కార్.

అదానీపై ప్రేమతో... సముద్రపు ఇసుక మైనింగ్ పై బ్యాన్ ఎత్తేయనున్న మోడీ సర్కార్
X

ప్రైవేటు కంపెనీలు సముద్రపు ఇసుక (బీచ్ సాండ్ ) మైనింగ్ చేయడాన్ని 2019 ఫిబ్రవరిలో మోడీ సర్కార్ బ్యాన్ చేసింది. అణుశక్తి ఉత్పత్తిలో ఉపయోగించే ఈ ఖనిజాల వెలికితీత నుండి ప్రైవేట్ కంపెనీలను దూరంగా ఉంచడానికి జాతీయ భద్రతను ఒక కారణంగా పేర్కొంది మోడీ సర్కార్. మోడీ తీసుకున్న ఈ చర్య దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను పరిరక్షించడంలో దూరదృష్టితో కూడిన చర్య అని బీజేపీ నాయకులు ఆ రోజు మోడీ ని పొగడ్తలతో ముంచెత్తారు.

మూడేళ్ళు గడిచిపోయాయి.... ఇప్పుడు గౌతమ్ అదానీ సముద్రపు ఇసుక (బీచ్ సాండ్ ) మైనింగ్ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అంతే ... మోడీ సర్కార్ యూ టర్న్ తీసుకుంది.

ఈ సంవత్సరం మే 25న, గనుల మంత్రిత్వ శాఖ గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం, 1975 (MMDR చట్టం)ను సవరించడం ద్వారా ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి తిరిగి అనుమతించే ప్రతిపాదనను రూపొందించింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, మైనింగ్ కంపెనీలు, ప్రజలతో సహా వివిధ వాటాదారుల నుండి సూచనలు , సలహాలు తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో సంప్రదింపులన్నీ ముగిశాయి. ఇప్పుడిక‌ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట సవరణలను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది మోడీ ప్రభుత్వం.

ప్రభుత్వం సంప్రదింపుల కోసం ముసాయిదాను పంపిణీ చేయడానికి ఒక నెల ముందు, ఏప్రిల్ 14, 27 తేదీలలో, అదానీ గ్రూప్ ఆంధ్ర ప్రదేశ్, పూరి నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ అనే తమ యజమాన్యంలోని రెండు అనుబంధ సంస్థలను విలీనం చేయడం గురించి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కి తెలియజేసింది. పూరి నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ ఒడిషాలో బీచ్ ఇసుక ఖనిజాలను, ముఖ్యంగా టైటానియం డయాక్సైడ్ (TiO2)ను ప్రాసెస్ చేస్తుంది.

ఇక మరొక ముఖ్యమైన విషయం... అదానీ కోస‍ం సముద్ర ఇసుక తవ్వకాల రంగంపై రాష్ట్రప్రభుత్వాలకున్న హక్కులను లాగేసుకోవడం చేయబోతోంది కే౦ద్రం. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల హక్కుగా ఉన్న ఈ ఖనిజాల మైనింగ్ లీజులను వేలం వేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా ముసాయిదా ప్రతిపాదన కోరింది.

ఈ ప్రతిపాదిత సవరణ జరిగితే, రాష్ట్ర ప్రభుత్వాలు మైనింగ్ లైసెన్సులను జారీ చేయడానికి తమకున్న‌ ప్రత్యేక హక్కులను కోల్పోతామ‌ని భయపడుతున్నాయి. ఈ చర్య‌ రాష్ట్ర అధికారాలను తగ్గించే ప్రయత్నంగా విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య పెరుగుతున్న వైరుధ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. సమాఖ్య వ్యవస్థ ను సంక్షోభంలో పడేస్తుంది. మోడీ సర్కార్ ప్రతిపాదిత సవరణలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను లాక్కోవడమే కాకుండా దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నాయి.

ఈ పరిశ్రమలో ఉన్న వ్యక్తులు చెప్తున్న దాని ప్రకారం, MMDR చట్టంలో ఈ ప్రతిపాదిత మార్పులు పార్లమెంటులో ఆమోదం పొందితే ఇప్పటి వరకు ఇసుక మైనింగ్‌లో ఉన్న చిన్న వ్యాపారులకు ఇకపై అవకాశం ఉండదు. ఇక‌ పెద్ద సంస్థలు మాత్రమే ఈ రంగంలో ఉండగల్గుతాయి.

కాగా బీచ్ ఇసుక లో ఇల్మెనైట్, రూటిల్, జిర్కాన్, గార్నెట్, సిల్లిమనైట్, మోనాజైట్, ల్యూకోక్సిన్ వంటి అనేక ఖనిజాలు ఉంటాయి.

అదానీ కంపెనీలు ఇల్మెనైట్, రూటిల్ ల్యూకాక్సిన్, గార్నెట్, జిర్కాన్, సిల్లిమనైట్ వంటి భారీ ఖనిజాలను ప్రాసెస్ చేసి విక్రయించాలనుకుంటున్నాయి. ఈ ఖనిజాలు అంతరిక్ష పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, ఎనర్జీ సెక్టార్, ఎలక్ట్రిక్ బ్యాటరీలు, న్యూక్లియర్ పరిశ్రమలో కీలకంగా ఉపయోగపడతాయి.

First Published:  7 Oct 2022 1:41 PM IST
Next Story