Telugu Global
National

పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ రచ్చ..

రాహుల్ పార్లమెంట్ లో తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మహిళా ఎంపీలతో కలసి లోక్ సభ స్పీకర్ కు ఆమె రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు.

పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ రచ్చ..
X

సోషల్ మీడియాలో ఈరోజు ఫ్లయింగ్ కిస్ అనేది హాట్ టాపిక్. పొలిటికల్ ట్రెండింగ్ లో కూడా ఇదే నెంబర్-1 స్థానంలో ఉంది. ఇదేదో సినిమాకు సంబంధించిన టాపిక్ అనుకుంటే పొరపాటే. భారత పార్లమెంట్ లో జరిగిన సంఘటన ఇది. ఫ్లయింగ్ కిస్ అని బీజేపీ ఎంపీలంటున్నారు, కాదుబాబోయ్ అని బదులిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం తగ్గేది లేదన్నారు. మహిళా ఎంపీలతో కలసి లోక్ సభ స్పీకర్ కు ఆమె రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. తనని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఆ సిగ్నల్ ఇచ్చారని స్మృతి ఇరానీ లేఖ రాశారు. ఆ లేఖలో 20మంది మహిళా ఎంపీలు సంతకాలు చేశారు.

లోక్ సభలోకి రీఎంట్రీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈరోజు అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో అధికార పక్షానికి చుక్కలు చూపించారు. మోదీకి చురకలంటించారు. అయితే ఆయన మాట్లాడే సందర్భంలో.. స్పీకర్ వైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నట్టు ఓ సంజ్ఞ చేశారు. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాహుల్ పార్లమెంట్ లో తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ‘స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌ లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. ఇలాంటి విపరీతాలను ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన ద్వారా తెలుస్తోంది.’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


హేమా మాలిని ఏమన్నారంటే..?

అదే సమయంలో బీజేపీకి చెందిన మరో మహిళా ఎంపీ హేమా మాలిని మాత్రం మరోలా స్పందించారు. రాహుల్ గాంధీ, లోక్ సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్టు తాను గుర్తించలేదన్నారు. పరోక్షంగా ఆమె స్మృతి ఇరానీ వ్యాఖ్యల్ని ఖండించారు. హేమా మాలిని వ్యాఖ్యల్ని హైలెట్ చేస్తూ స్మృతి ఇరానీకి కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు రాహుల్, స్మృతి ఇరానీ వైపు చూడలేదని, ఆమె ఉలిక్కిపడటం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. ఈ కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో.. సోషల్ మీడియాలో ఫ్లయింగ్ కిస్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది.

First Published:  9 Aug 2023 11:39 AM
Next Story