Telugu Global
National

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి

అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి
X

ఇండియన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా మాచేడి ప్రాంతంలో ఈ ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లు మాచేడి – కిండ్లీ – మల్హార్‌ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.

ఉగ్రవాదులు పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి దిగినట్టు తెలుస్తోంది. తొలుత కాన్వాయ్‌పై గ్రనేడ్‌ విసిరిన ఉగ్రవాదులు.. వాహనం ఆగిపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఆర్మీ అదనపు బలగాలు.. వెంటనే అక్కడికి చేరుకొని కూంబింగ్‌ చేపట్టాయి.

ఉగ్రవాదులు గత రెండు రోజుల్లో దాడికి పాల్పడటం ఇది రెండోసారి. ఆదివారం తెల్లవారుజామున రాజౌరీ వద్ద సైనిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు చీకట్లో పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి సైన్యం గాలింపు చేపట్టింది. మరోపక్క కుల్గామ్‌ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. శనివారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

First Published:  9 July 2024 3:42 AM GMT
Next Story