Telugu Global
National

ఒడిశాలో స్క్రబ్‌ టైఫస్‌.. ఐదుగురు మృతి

ప్రజల్లో కూడా స్క్రబ్‌ టైఫస్ వ్యాప్తిపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.

ఒడిశాలో స్క్రబ్‌ టైఫస్‌.. ఐదుగురు మృతి
X

ఒడిశాలో ప్రాణాంతక బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌లు కలకలం రేపుతున్నాయి. స్క్రబ్‌ టైఫస్‌ అనే వ్యాధి బారినపడి ఒడిశాలోని బార్‌గఢ్‌ జిల్లాలో ఐదుగురు మరణించారు. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రాణాలు తీసే ఈ వ్యాధి మరింత విస్తరించకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఆరోగ్య విభాగం అధికారులకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్ యొక్క సీజనల్ పెరుగుదలపై నిఘా పెంచాలని సూచించింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల చీఫ్‌ మెడికల్ ఆఫీస‌ర్ల‌కు, ప్రజారోగ్య అధికారులకు, భువనేశ్వర్‌లోని క్యాపిటల్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌కు, అలాగే రూర్కెలా RGH డైరెక్టర్‌కు కూడా ఆరోగ్య శాఖ స్క్రబ్‌ టైఫస్ నిర్మూలనకు అవసరమైన సూచనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విపరీతంగా కేసులు నమోదవుతుండటం, ఒకే జిల్లాలో 5 మరణాలతో స్క్రబ్ టైఫస్ తోపాటు సీజనల్ వ్యాధి అయిన లెప్టోస్పిరోసిస్ వ్యాధులను గుర్తించి, వ్యాధి నిర్ధారణ, నివారణ కోసం ఇంటెన్సివ్ నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది.

వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స అందించేలా అనుక్షణం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది. అన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని, అందుకు కావాల్సినన్ని టెస్ట్‌ కిట్స్‌ను సరఫరా చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది.

ప్రజల్లో కూడా స్క్రబ్‌ టైఫస్ వ్యాప్తిపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. ఈ స్క్రబ్‌ టైఫస్‌నే బుష్‌ టైఫస్‌ అని కూడా అంటారు. ఓరియెంటా సుసుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి జనాల్లో విస్తరిస్తుంది.

మరివైపు ఇదే వ్యాధి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా కలకలం రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకరి మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ వ్యాధికారణంగా ఇప్పటికే 9 మంది మృతిచెందారు.

First Published:  15 Sept 2023 1:57 PM IST
Next Story