Telugu Global
National

ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మృతి

రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గూడ్స్‌ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మృతి
X

పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌ రైలు.. స్టేషన్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వెనుక నుంచి వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైళ్లు రెండూ ఒకే ట్రాక్‌పై రావడమే ప్రమాదానికి కారణమైంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. డార్జిలింగ్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒక బోగీ గాల్లోకి లేవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ప్రమాదంతో గూడ్స్‌ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి.

అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌ జంఘా ఎక్స్‌ప్రెస్‌ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గూడ్స్‌ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై డార్జిలింగ్‌ అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారని, మరో 25 మంది వరకు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

సీఎం, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి

రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనిపై స్పందిస్తూ.. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

First Published:  17 Jun 2024 7:06 AM GMT
Next Story