రెజ్లింగ్ సమాఖ్యకు మహిళా అధ్యక్షురాలు.. - కేంద్ర మంత్రి ముందు రెజ్లర్ల డిమాండ్
బుధవారం ఉదయం బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ చర్చల నిమిత్తం అనురాగ్ ఠాకూర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను వారు మంత్రి ముందుంచారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయడంతో పాటు రెజ్లింగ్ సమాఖ్యకు మహిళా అధ్యక్షురాలిని నియమించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో బుధవారం జరిగిన భేటీ సందర్భంగా రెజ్లర్లు మొత్తం 5 డిమాండ్లను ఆయన ముందుంచినట్టు జాతీయ మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి.
బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం బుధవారం వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించింది. "రెజ్లర్ల సమస్యలపై వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయమై వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించాను`` అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి ఆహ్వానాన్ని రెజ్లర్లు అంగీకరించారు. బుధవారం ఉదయం బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ చర్చల నిమిత్తం అనురాగ్ ఠాకూర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను వారు మంత్రి ముందుంచారు.
రెజ్లర్ల డిమాండ్లివీ..
- భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి.
- బ్రిజ్ భూషణ్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ రెజ్లింగ్ సమాఖ్యలో భాగం కాకూడదు.
- రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాలక మండలికి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి.
- ఏప్రిల్ 28న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్రిక్తతల కారణంగా మాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దుచేయాలి.
- లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి.
ప్రభుత్వంతో రెజ్లర్లు చర్చలు జరపడం గత వారం రోజుల్లో ఇది రెండోసారి. గత శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశంలో తమకు ఆశించిన ఫలితం దక్కలేదని బజ్‌రంగ్ పునియా తెలిపారు.