Telugu Global
National

ఎట్టకేలకు కనిపించిన టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు..

10 రోజుల తర్వాత.. ట‌న్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల దృశ్యాలను చూసిన వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైయ్యారు.

ఎట్టకేలకు కనిపించిన టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు..
X

ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో టన్నెల్​ కూలిన ఘటనకు సంబంధించిన సహాయక చర్యలు 10వ రోజుకు చేరాయి. కార్మికులంతా క్షేమంగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. అయితే సోమవారం నాడు కొండ పైభాగంలో ఆరు అంగుళాల మేర 54 మీటర్ల లోతులో రంధ్రం చేసి.. దాని ద్వారా ఆహారం పంపారు. వాటితో ఎండోస్కొపీ కెమెరాను లోపలికి పంపడంతో మొదటిసారి కూలీల ఫొటోలు బయటకు వచ్చాయి.

కార్మికులు సేఫ్టీ టోపీలు ధరించి.. కెమెరాకు చేతులు ఊపుతూ తాము బాగానే ఉన్నామని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. సుమారు 10 రోజుల తరువాత సోమవారం రాత్రి వాళ్ళకి బాటిళ్ల ద్వారా ఆహారం పంపారు. అంత వరకూ వారు నీళ్లు, డ్రైఫ్రూట్స్‌తోనే సరిపెట్టుకున్నారు. దీనివల్ల వారు చాలా నీరసంగా కనిపించారు. ఇప్పటికే అవసరం అయిన మెడిసిన్ పంపిన‌ అధికారులు.. తాజాగా మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను కూడా పైపు ద్వారా పంపినట్టు తెలిపారు. లోపల చిక్కుకున్న కార్మికుల వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ.. వారంతా క్షేమంగా ఉన్నారని, త్వరలోనే బయటకు తీసుకొస్తామని చెప్పారు. 10 రోజుల తర్వాత.. ట‌న్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల దృశ్యాలను చూసిన వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైయ్యారు.


గత వారం ఆ ప్రాంతంలోని రాళ్ల స్వభావం, ఇతర సమస్యలు, పలు సవాళ్ల కారణంగా కార్మికులను రక్షించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకానొక సమయంలో కొండచరియలు విరిగిపడటం కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అడ్డుప‌డింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఐదు ఎంపికల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

కూలీలు చిక్కుకున్న సొరంగానికి మూడు వైపుల నుంచి డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. ఐదు వేర్వేరు సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించారు. ప్రధాన సొరంగం కుడి, ఎడమ వైపు నుండి రెండు సొరంగాలు తవ్వుతున్నామని, సొరంగంపై నుండి కూడా డ్రిల్లింగ్‌ చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, బిఆర్ఓ, ఐటిబిపితో సహా పలువురు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. డిఆర్‌డిఓ నుండి రోబోటిక్స్‌ బృందం కూడా అక్కడికి చేరుకుందని, త్వరలోనే కూలీలంతా క్షేమంగా బయటకు వస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


First Published:  21 Nov 2023 7:45 AM GMT
Next Story