Telugu Global
National

బీజేపీకి సిలిం'డర్', గుజరాత్ లో నేడే తొలిదశ పోలింగ్

బీజేపీ పాలనలో గ్యాస్ భారం పెరిగిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు సింబాలిక్ గా ప్రజలను మరోసారి హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బీజేపీకి సిలిండర్, గుజరాత్ లో నేడే తొలిదశ పోలింగ్
X

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. మలిదశ ఈనెల 5న జరుగుతుంది. 8వతేదీ ఫలితాలు విడుదలవుతాయి. తొలిదశ పోలింగ్ మొదలవగానే బీజేపీలో భయం పట్టుకుంది. దీనికి తగ్గట్టుగానే ఓటింగ్ రోజు అక్కడ కాంగ్రెస్ నేతలు బీజేపీని భయపెడుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకోడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పరేష్ ధనాని.. సైకిల్ పై పోలింగ్ స్టేషన్ కి చేరుకున్నారు. వస్తూ వస్తూ తన సైకిల్ వెనక సిలిండర్ కట్టుకొచ్చారు. ఆయనతోపాటు మరికొందరు కూడా సైకిల్ వెనక గ్యాస్ సిలిండర్ కట్టుకొని వచ్చారు. పరోక్షంగా బీజేపీ పాలనలో గ్యాస్ భారం పెరిగిపోయిందంటూ వారు సింబాలిక్ గా ప్రజలను మరోసారి హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైకిల్ పై గ్యాస్ సిలిండర్లను చూసిన ఓటర్లలో ఏ ఒక్కరూ బీజేపీకి తిరిగి ఓటు వేయాలని అనుకోరని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

కేంద్రం తప్పులు, గుజరాత్ తిప్పలు..

డబుల్ ఇంజిన్ సర్కార్ తో డబుల్ అభివృద్ధి అంటూ కేంద్రం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటోంది. అయితే ఆ డబుల్ ఇంజినే ఇప్పుడు గుజరాత్ లో బీజేపీకి కష్టాలు కొనితెచ్చేలా ఉంది. పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెరిగిపోవడాన్ని ప్రతిపక్షాలు బాగా హైలెట్ చేస్తున్నాయి. గ్యాస్ భారం పెంచేసి మధ్యతరగతి ప్రజలను కష్టాలపాలుచేశారని, ఇక డబుల్ ఇంజిన్ అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ లో బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరాయి. ఇక నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఇతరత్రా కారణాలతో బీజేపీకి గుజరాత్ లో పెద్ద ఎదురుదెబ్బే తగిలేలా ఉంది.

ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, రాష్ట్ర ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశాబ్ధాలుగా బీజేపీకి గుజరాత్ కంచుకోటగా ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో, కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి మాత్రం రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ పాగా వేయాలని చూస్తోంది.

First Published:  1 Dec 2022 6:13 AM GMT
Next Story