Telugu Global
National

రైలులో సిలిండర్‌ పేలి 8 మంది మృతి..

టూరిస్ట్‌ రైలులో భక్తులు గ్యాస్ సిలిండర్ ఉపయోగించి వంట చేయడం వల్ల మంటలు చెలరేగినట్లుగా ప్రాథ‌మిక విచారణలో తేలింది. ఒక కంపార్ట్‌మెంట్‌ నుంచి మరో కంపార్ట్‌మెంట్‌కు మంటలు వేగంగా వ్యాపించాయి.

రైలులో సిలిండర్‌ పేలి 8 మంది మృతి..
X

మధురై రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లక్నో-రామేశ్వరం ట్రైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమ‌య్యారు. వివరాల్లోకి వెళితే.. లక్నో-రామేశ్వరం ట్రైన్ 55 మంది ప్రయాణికులతో శుక్రవారం లక్నో నుంచి బయల్దేరింది. మధురై రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రైన్ కాసేపు ఆగింది. ఆ సమయంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. టూరిస్ట్‌ రైలులో భక్తులు గ్యాస్ సిలిండర్ ఉపయోగించి వంట చేయడం వల్ల మంటలు చెలరేగినట్లుగా ప్రాథ‌మిక విచారణలో తేలింది. ఒక కంపార్ట్‌మెంట్‌ నుంచి మరో కంపార్ట్‌మెంట్‌కు మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు కేకలు వేస్తూ హుటాహుటిన రైలు నుంచి బయటకు వచ్చారు. ఈ ప్ర‌మాదంలో 8 మంది మృతిచెందారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో గాయ‌ప‌డిన సుమారు 20 మందిని సమీపంలోని ఆస్ప‌త్రికి తరలించారు. మంటలు వ్యాపించిన కంపార్ట్‌మెంట్‌ను ట్రైన్ నుంచి వేరు చేశారు. తెల్లవారు జామున 5.30 గంట‌లకు ఈ ప్ర‌మాదం జ‌రిగింది.



అగ్ని ప్ర‌మాద విష‌యాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు, మధురై నగర పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కోచ్ లను ట్రైన్ నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని ప‌రిశీలించి కేసు న‌మోదు చేసికొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




నిజానికి రైలులో పటాసులు, పేలుడు పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు, కిరోసిన్, పెట్రోల్ వంటివి నిషేధం. ఎవరైనా ఈ వస్తువులు కలిగి ఉన్నట్లు తేలితే, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగి వారితో పాటు వారి చుట్టూ ఉన్నవారి ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచిఉంటుంది.

*

First Published:  26 Aug 2023 11:27 AM IST
Next Story