బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం
పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ఫ్యాక్టరీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్యలో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు.
పశ్చిమ బెంగాల్ లో దారుణం జరిగింది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. వారంతా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అని తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
యూనివర్శిటీకి కూతవేటు దూరంలో..
పశ్చిమ బెంగాల్ స్టేట్ యూనివర్సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. బాణసంచా ఫ్యాక్టరీ నివాస గృహాల మధ్య ఉండటంతో పోలీసులు పరిసర ప్రాంతాలవారిని అప్రమత్తం చేసి అక్కడి నుంచి తరలించారు. పేలుడు ధాటికి దాదాపు 3కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల వారు కూడా ఉలిక్కి పడ్డారంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఘటనా స్థలంలో మృతదేహాలన్నీ చెల్లాచెదరుగా పడిపోయాయి. అవయవాలు మాంసం ముద్దల్లా మారిపోయి చెల్లాచెదరయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | West Bengal: Police and bomb disposal squad present at the spot after five people were killed in an explosion at a firecracker factory in Duttapukur. pic.twitter.com/X3ZhqUyKsS
— ANI (@ANI) August 27, 2023
క్షతగాత్రులకు వైద్యం..
పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ఫ్యాక్టరీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్యలో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఇటీవల కాలంలో బెంగాల్ లో ఇలాంటి ఘోరం జరగలేదని అంటున్నారు స్థానికులు. ప్రభుత్వం ఈ ఘటనపై దృష్టిపెట్టింది. సీఎం మమతా బెనర్జీ ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను ఆదేశించారు.
♦