Telugu Global
National

రాహుల్ గాంధీ యాత్రపై కేసు.. ఎందుకంటే?

మొదటిరోజే అస్సాంలో యాత్రకు అద్భుత స్పందన వచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. యాత్ర విజయంతంగా సాగడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు టెన్షన్ పట్టుకుందన్నారు.

రాహుల్ గాంధీ యాత్రపై కేసు.. ఎందుకంటే?
X

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన "భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర"పై కేసు నమోదైంది. రూట్‌మ్యాప్ విషయంలో నిబంధలు ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. మణిపూర్‌ నుంచి మొదలైన రాహుల్ యాత్ర ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. గురువారం న్యాయ్ యాత్ర అస్సాంలోని జోర్హాట్‌ పట్టణం దగ్గర తాము కేటాయించిన మార్గంలో కాకుండా మరోవైపు వెళ్లారని అస్సాం పోలీసులు FIR నమోదు చేశారు. రూట్ మ్యాప్ ఛేంజ్ చేయడం వల్ల పట్టణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ట్రాఫిక్‌ బారికేడ్లను తొలగించేలా, పోలీసులపై దాడి చేసేలా ప్రజలను కాంగ్రెస్‌ నేతలు రెచ్చగొట్టారని FIRలో పేర్కొన్నారు పోలీసులు. యాత్ర, యాత్ర నిర్వాహకులపై కేసు నమోదైంది.

కాంగ్రెస్ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. పోలీసులు చేసిన ఆరోపణలను వారు కొట్టిపారేశారు. ఇదంతా యాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నమంటూ మండిపడ్డారు. తమకు ఇరుకైన మార్గం కేటాయించారన్న కాంగ్రెస్ నేతలు.. ఆ ఏరియాలో చాలా రద్దీ ఉందన్నారు. అందుకే కొంతదూరం పక్కమార్గంలో ప్రయాణించామని వివరించారు. మొదటిరోజే అస్సాంలో యాత్రకు అద్భుత స్పందన వచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. యాత్ర విజయంతంగా సాగడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు టెన్షన్ పట్టుకుందన్నారు. జనం దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్‌గాంధీ మొదలుపెట్టిన ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు సాగనుంది. 67 రోజుల పాటు జరిగే ఈ యాత్ర 15 రాష్ట్రాలు 100 లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేయనుంది. జనవరి 14న మణిపుర్‌లోని ధౌబల్‌ పట్టణంలో మొదలైన ఈ యాత్ర.. దాదాపు 6713 కిలీమీటర్లు సాగనుంది.

First Published:  19 Jan 2024 3:11 PM IST
Next Story