'స్టార్‌డమ్ శకం ముగిసింది..ఇప్పటి స్టార్ లకు అంత సీన్ లేదు...!' : శత్రుఘ్నసిన్హా
కోవిడ్ మహమ్మారి స్టార్‌డమ్ స్థాయిని దాదాపుగా ముగించింది అని ప్రముఖ నటుడు శత్రుఘ్నసిన్హా అన్నారు. ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించే శక్తి స్టార్‌లకు ఉండడం లేదు అని ఆయన పేర్కొన్నారు.
హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌డమ్ ముగిసిన శకమని ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను థియోటర్లకు రప్పించే శక్తి ప్రస్తుత స్టార్లలో సన్నగిల్లిందని అన్నారు. బాలీవుడ్ లో నిస్తేజ దశ గురించి, ఓటిటి ప్రభావం తదితర అంశాలపై ఆయన ముక్కుసూటిగా తన అభిప్రాయాలు చెప్పారు.
బాలీవుడ్ లో నిస్తేజమైన దశ, బాయ్ కాట్ ట్రెండ్ వంటి పోకడలపై స్పందిస్తూ .. కోవిడ్ మహమ్మారి తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయని శత్రుఘ్నసిన్హా తెలిపారు. "కోవిడ్ మహమ్మారి సినిమా వ్యాపారం వెన్ను విరిచిందని చెప్పారు. ఇది స్టార్‌డమ్ స్థాయిని దాదాపుగా ముగించింది. స్టార్స్ జీవితాలు కూడా వాస్తవాలకు భిన్నం కాదు గదా. మహమ్మారి ప్రతి ఒక్కరినీ సమానంగా చేసింది" అని శత్రుఘ్న అన్నారు.
డెబ్భై దశకంలో శతృఘ్నసిన్హా షాట్ గన్ గా , సూపర్‌స్టార్‌లలో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. అతని వ్యక్తిత్వం అతన్ని అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, ధర్మేంద్ర వంటి ఇతర నటులకు కు గట్టి పోటీదారుగా నిలిపింది. బాలీవుడ్ లో స్తబ్దత పై మాట్లాడుతూ ఆయన సూపర్ స్టార్ శకం ముగిసినట్లే అనిపిస్తోందని, అయితే ఏవో కొన్ని సెలెక్టివ్ సినిమాలు, స్టార్స్ మాత్రమే పని చేయగలరని ఆయన అన్నారు. "అంతేకాకుండా, కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూడటం చాలా ఖరీదైపోయింది. ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించే శక్తి స్టార్‌లకు ఉండడం లేదు. వారు ఉన్నత స్థాయినుంచి రావడంతో వాస్తవాలకు భిన్నంగా ఉండడంతో దాదాపు వారి వ్యక్తిగత, సామాజిక ఇమేజ్ కూడా దెబ్బతింటున్నది అని అన్నారు.
ఇక తన సంతానం గురించి మాట్లాడుతూ కూతురు సోనాక్షి లో చాలా ఆత్మవిశ్వాసం తో పాటు టాలెంట్ కూడా ఉంది. ఆమె చాలా బాగా చేస్తోంది. కొడుకులు లవ్, కుశ లు కూడా గట్టి నమ్మకంతో పని చేస్తారని అన్నారు. కానీ సోనాక్షి తన తండ్రి నుంచి టాలెంట్ ను , తల్లి నుంచి అందాన్ని వారసత్వంగా పొందిందని ప్రజలు అంటున్నారు. " అన్నారు. సోనాక్షి వివాహం గురించి అడిగినప్పుడు, 18 ఏళ్లు నిండినప్పటి నుండి తన పిల్లల జీవితంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. వారు సరైన సమయంలో, సరైన వయస్సులో సరైన నిర్ణయం తీసుకుంటారని తాను విశ్వసిస్తున్నాను అని చెప్పాడు.