Telugu Global
National

పండగ సీజన్లో భారీగా తాత్కాలిక ఉద్యోగాలు

ఈ సీజన్లోనే తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకోడానికి ఆసక్తి చూపిస్తుంటాయి కంపెనీలు. దాదాపుగా ఒక్కో కంపెనీ 2 లక్షలమందిని నియమించుకుంటుందని సమాచారం.

పండగ సీజన్లో భారీగా తాత్కాలిక ఉద్యోగాలు
X

పండగ సీజన్ మొదలు కాబోతోంది. ఓనమ్‌, రక్షా బంధన్‌, కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్‌, న్యూ ఇయర్.. ఇలా ఆగస్ట్ నుంచి డిసెంబరు చివరి వరకు పండగల సందడి నెలకొంటుంది. ఈ పండగల్లో మధ్యతరగతి, ధనిక వర్గాలు షాపింగ్ పై విపరీతంగా ఖర్చుపెడతాయి. అందుకే ఈ సీజన్లో ఆఫర్లు వెల్లువలా వచ్చిపడతాయి, కస్టమర్లను ఆకట్టుకోడానికి భారీగా రిబేట్లు ప్రకటిస్తాయి కంపెనీలు. అమ్మకాలు పెరిగితే, దానికి తగ్గట్టుగా వస్తువుల డెలివరీలు కూడా పెరగాలి. అంటే పండగ సీజన్లో ఆన్ లైన్, లేదా ఆఫ్ లైన్ షాపులకు తాత్కాలిక సిబ్బంది బాగా అవసరం. ఈ ఏడాది దాదాపు 7 లక్షలమందికి పండగ సీజన్లో తాత్కాలిక ఉద్యోగాలు దక్కుతాయని అంచనా. మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా, టీమ్ లీజ్ సంస్థలు చేపట్టిన అధ్యయనంలో 7 లక్షల వరకు తాత్కాలిక ఉద్యోగులు వివిధ కంపెనీలకు అవసరం అని తేలింది.

ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలు ఈ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆన్ లైన్ లో వస్తువులకు ఆర్డర్ పెట్టినప్పటినుంచి, ఆ ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు వివిధ విభాగాల్లో ఉద్యోగులు అవసరం అవుతారు. అయితే పండగ సీజన్లో వచ్చిపడే ఆర్డర్లను తట్టుకోడానికి వీరు అవసరం, ఆ తర్వాత వీరితో పెద్దగా పని ఉండదు. అందుకే ఈ సీజన్లోనే తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకోడానికి ఆసక్తి చూపిస్తుంటాయి కంపెనీలు. దాదాపుగా ఒక్కో కంపెనీ 2 లక్షలమందిని నియమించుకుంటుందని సమాచారం. చిన్న చిన్న కంపెనీలు కూడా వారికి తగ్గ స్థాయిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు పొందుతాయి.

పెద్ద నగరాల్లోనే..

బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, చెన్నై లో ఇప్పటికే గోడౌన్లకు గిరాకీ పెరిగింది. ఆన్ లైన్ లో కస్టమర్లు బుక్ చేసిన వస్తువులను స్థానికంగా కొన్ని గోడౌన్లలో నిల్వ చేస్తారు. ఆ తర్వాత వాటిని డెలివరీ చేస్తారు. ఇలాంటి గోడౌన్లకి ఇప్పుడు గిరాకీ పెరిగింది. మెట్రో నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాలైన వడొదర, పుణె, కోయంబత్తూరులలో గోడౌన్లతో పాటు స్టాఫ్ కి కూడా డిమాండ్ పెరిగింది.

First Published:  2 Aug 2023 10:28 AM IST
Next Story