Telugu Global
National

నిన్న డీఎస్పీని, నేడు మహిళా ఎస్ ఐ ని వాహనంతో తొక్కించి చంపిన మాఫియా

దేశంలో అనేక రకాల మాఫియా రాజ్యం చేస్తోంది. వాళ్ళ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. నిన్న హర్యాణాలో ఓ డిఎస్పీని వాహనంతో గుద్ది చంపిన మాఫియా ఇవ్వాళ్ళ జార్ఖండ్ లో ఓ మహిళా ఎస్సైని అదే పద్దతిలో హత్య చేసింది.

నిన్న డీఎస్పీని, నేడు మహిళా ఎస్ ఐ ని వాహనంతో తొక్కించి చంపిన మాఫియా
X

హర్యానాలో మైనింగ్ మాఫియా స్మగ్లర్లు తమ ట్రక్కుతో సురేంద్ర సింగ్ బిష్ణోయ్ అనే డీఎస్పీని ఢీ కొట్టించి ఆయనను హతమార్చిన ఘటన మరవకముందే ఝార్ఖండ్ లో అలాంటి సంఘటనే జరిగింది. రాష్ట్ర రాజధాని రాంచీలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్న సంధ్య టోప్నో అనే మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ని కూడా వ్యాన్ తో తొక్కించి హతమార్చారు. అనుమానాస్పద వస్తువులను ఓ వ్యాన్ లో రవాణా చేస్తున్నారన్న సమాచారం అందడంతో ఈ ఎస్ఐ తన సిబ్బందితో ఒక చోట కాపు కాయగా వేగంగా వస్తున్న వ్యాన్ ను ఆపవలసిందిగా కోరారని, కానీ ఆ వ్యాన్ డ్రైవర్ ఆపకుండా ఆమెపై నుంచి వాహనాన్ని పోనిచ్చాడని తెలిసింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించారు. వ్యాన్ ఆపకుండా పారిపోయిన డ్రైవర్ ని ఆ తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి బ్యారికేడ్లు లేవని, వ్యాన్ ని చూసిన సంధ్య తన వాహనం నుంచి దిగి వ్యాన్ ని ఆపడానికి యత్నించినా ఫలితం లేకపోయిందని సమాచారం. ఆమె మృతి పట్ల ఝార్ఖండ్ పోలీసు శాఖ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. - ఈ ప్రాంతంలో పశువుల అక్రమ రవాణా జరుగుతోందని, ఓ పెద్ద రాకెట్ అక్రమంగా ఈ దందాకు పాల్పడుతోందని తెలిసింది. తాజా ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

2018 లో కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించి ఎస్ఐ గా ప్రమోషన్ పొందిన సంధ్య ఓ మాఫియా చేతిలో మరణించడం దురదృష్టకరమని రాంచీ డీఎస్పీ అన్నారు. ఇక హర్యానాలోని ఆరావళి కొండ ప్రాంతంలో మైనింగ్ మాఫియా కార్యకలాపాలపై నిన్న దర్యాప్తునకు వెళ్లిన డీఎస్పీ సురేంద్ర సింగ్ .. ఓ ట్రక్కును ఆపడానికి ప్రయత్నించగా ట్రక్కు డ్రైవర్ ఆయనపై నుంచి వేగంగా వాహనాన్ని పోనిచ్చాడు. ఈ సంఘటనలో సురేంద్ర సింగ్ మృతి చెందారు. షాక్ నుంచి తేరుకున్న పోలీసులు ఆ ట్రక్కును వెంబడించగా ఒక చోట వాహనాన్ని నిలిపివేసిన డ్రైవర్, మరో వ్యక్తి పారిపోతుండగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని, మరొకడ్ని పోలీసులు అరెస్టు చేశారు.





First Published:  20 July 2022 11:24 AM IST
Next Story