Telugu Global
National

కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన బీజేపీ ప్రభుత్వం

ఆర్‌జీసీటీ నార్త్ ఇండియాలోని వెనుక బడిన ప్రాంతాల్లో పని చేస్తోంది. ఉత్తర ప్రదేశ్, హర్యన, రాజస్థాన్ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది.

కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన బీజేపీ ప్రభుత్వం
X

కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలోని బీజేపీ మరోసారి షాకిచ్చింది. ఆ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ)లు విదేశాల నుంచి విరాళాలు తెచ్చుకునే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) లైసెన్సును రద్దు చేసింది. రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత 1991లో ఆర్‌జీఎఫ్‌ను ఏర్పాటు చేశారు. రాజీవ్ మనసులో ఉన్న ఆలోచనలకు రూపం ఇవ్వడానికి ఈ సంస్థ పని చేస్తోంది. దేశంలో సద్భావన వాతావరణం ఉండటానికి.. భారతీయులందరూ ఇతర దేశాలకు పోటీగా తయారవడానికి ఆర్‌జీఎఫ్ కృషి చేస్తోంది. ఇండియాలో సైన్స్, టెక్నాలజీ, ఐటీ, టెలికాం రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి, మహిళ, యువత స్వశక్తిపై ఎదగడానికి కూడా పాటు పడుతోంది. పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీల్లో వరదలు, కరువు, ప్రకృతి విపత్తులు, హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడి వారికి సాయం అందిస్తోంది.

మరోవైపు ఆర్‌జీసీటీ నార్త్ ఇండియాలోని వెనుక బడిన ప్రాంతాల్లో పని చేస్తోంది. ఉత్తర ప్రదేశ్, హర్యన, రాజస్థాన్ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. 2002లో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా ప్రారంభించబడిన ఈ సంస్థను చాలా పకడ్బంధీగా నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ మహిళా వికాస్ పరియోజన అనే కార్యక్రమం ద్వారా యూపీలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలకు చేయూత అందిస్తోంది. అంతే కాకుండా ఇందిరా గాంధీ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా 40 లక్షల మందికి వైద్య సేవలు అందించింది. దాదాపు 5 లక్షల మందికి సర్జరీల ద్వారా కంటి చూపును తిరిగి వచ్చేలా చేసింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు విదేశాల నుంచి నిధులను సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ రెండు సంస్థలకు లైసెన్సులు రద్దు చేయడంతో విదేశీ విరాళాలు ఆగిపోనున్నాయి. రెండు ఎన్జీవోలకు కూడా సోనియా గాంధీ చైర్ పర్సన్‌గా.. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ప్రియాంకా వాద్రా, చిదంబరం వంటి నాయకులు ట్రస్టీలుగా ఉన్నారు.

దేశంలో భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతోనే బీజేపీకి భయం పట్టుకున్నదని.. అందుకే దొడ్డి దారిన దెబ్బ తీసేందుకు ఈ నిర్ణయం తీసుకుందని జై రాం రమేశ్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆర్‌జీఎఫ్, ఆర్జీసీటీల గౌరవాన్ని భంగ పరిచేందుకే మోడీ ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. ఈ అవాంతరాలన్నింటినీ దాటుకొని తిరిగి ఆ సంస్థలు తమ సేవను కొనసాగిస్తాయని జై రాం రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ రెండు సంస్థలు నిబందనలు ఉల్లంధించి.. నిధులను పక్క దారి పట్టించాయని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే లైసెన్సులు రద్దు చేశామని చెబుతోంది.

First Published:  24 Oct 2022 4:44 AM GMT
Next Story