టెక్కీల మృతికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి అరెస్ట్
బాలుడికి కారు ఇచ్చిన తండ్రిపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నలు లేవనెత్తారు. విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఔరంగాబాద్ పోలీసులు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రిని తాజాగా అరెస్టు చేశారు.
పూణేలో ఆదివారం ఓ లగ్జరీ కారును నడిపిన బాలుడు ఇద్దరు యువకుల మృతికి కారణమైన సంగతి తెలిసిందే. పోలీసులు బాలుడిని అరెస్టు చేయగా.. కేవలం 15 గంటల్లోనే అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైగా ప్రమాదం జరిగిన తీరుపై ఒక వ్యాసం రాయాలని కోర్టు బాలుడికి సూచించింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇద్దరు మృతికి కారణమైన బాలుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గంటల వ్యవధిలోనే బెయిల్ ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి.
బాలుడికి కారు ఇచ్చిన తండ్రిపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నలు లేవనెత్తారు. విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఔరంగాబాద్ పోలీసులు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రిని తాజాగా అరెస్టు చేశారు. ఆదివారం ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రెస్టారెంట్లో భోజనం చేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు టెక్కీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ప్రమాదానికి కారణమైన కారు ఔరంగాబాద్ కు చెందిన బిల్డర్ విషాల్ అగర్వాల్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి పరోక్షంగా కారణమైన అగర్వాల్ ను అరెస్టు చేయకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న అగర్వాల్ కోసం ఔరంగాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతడి ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు.