సొరంగం నుంచి కొడుకొస్తాడని ఎదురుచూస్తూ తండ్రి మృతి
మంగళవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బర్సా ముర్ము తన అల్లుడితో కలసి ఇంట్లోని మంచం మీద కూర్చున్నాడు. ఇంతలోనే ఆకస్మాత్తుగా మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను మంగళవారం సాయంత్రం రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఈ సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడి తండ్రి తన కుమారుడు ఎప్పుడు ఇంటికి వస్తాడో.. అని ఎదురు చూస్తూనే కన్నుమూశాడు. చివరికి కుమారుడిని చూడకుండానే అతడు చనిపోయాడు.
సొరంగంలో చిక్కుకున్న 41 మందిలో జార్ఖండ్ రాష్ట్రం తూర్పు సింగ్ భూమ్ జిల్లా దుమారియా బ్లాక్‌కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. వీరిలో భక్తు ముర్ము (29) ఒకరు. భక్తు ముర్ము సొరంగంలో చిక్కుకుపోయినప్పటి నుంచి అతడి తండ్రి బర్సా ముర్ము(70) తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కుమారుడు ఎప్పుడెప్పుడు సొరంగం నుంచి బయటకు వస్తాడా.. అని ఎదురుచూపులతో మనోవేధనకు లోనయ్యాడు.
మంగళవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బర్సా ముర్ము తన అల్లుడితో కలసి ఇంట్లోని మంచం మీద కూర్చున్నాడు. ఇంతలోనే ఆకస్మాత్తుగా మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడు.
మంగళవారం సాయంత్రం రెస్క్యూ బృందాలు సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చారు. భక్తు ముర్ము బయటకు వచ్చిన వెంటనే తండ్రి మృతిచెందిన వార్త తెలుసుకొని తల్లడిల్లిపోయాడు. 17 రోజులపాటు కుమారుడి కోసం ఎదురుచూసిన తండ్రి అతడు సురక్షితంగా బయటికి వచ్చేసరికి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.