ఫాస్టాగ్ వసూళ్లలో సరికొత్త రికార్డు.. - ఒక్కరోజులో రూ.193.15 కోట్ల చెల్లింపులు
ఫాస్టాగ్ విధానాన్ని 2021 ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి జరుగుతున్న వసూళ్లలో ఏప్రిల్ 29న జరిగిందే అత్యధికం కావడం గమనార్హం.
టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ ఫీజుల విషయంలో జాప్యాన్ని నివారించేందుకు అమలులోకి తెచ్చిన ఫాస్టాగ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాల వద్ద ఈ విధానంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీన ఒక్కరోజే రూ.193.15 కోట్ల టోల్ చార్జీని వాహనదారులు చెల్లించినట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మంగళవారం వెల్లడించింది. కోటీ 16 లక్షల లావాదేవీల ద్వారా వాహనదారులు ఈ సొమ్మును చెల్లించినట్టు తెలిపింది.
ఫాస్టాగ్ విధానాన్ని 2021 ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి జరుగుతున్న వసూళ్లలో ఏప్రిల్ 29న జరిగిందే అత్యధికం కావడం గమనార్హం. ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేసే టోల్‌ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1228కి పెంచినట్టు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. అందులో 339 రాష్ట్ర టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.9 కోట్ల ఫాస్టాగ్ కార్డులను జారీ చేసినట్టు NHAI పేర్కొంది.