సగానికి పడిపోయిన ఉల్లి ధర.. వినియోగదారుల హర్షం.. రైతుల్లో నైరాశ్యం
ఉల్లి ధరల తగ్గుదలతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలని గుజరాత్, మహారాష్ట్ర సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
కొద్దిరోజుల కిందటి వరకు ఉల్లి ధరలు సామాన్యులను భయపెట్టాయి. కిలో ఉల్లి రూ. 80 నుంచి రూ.100 వరకు పలకడంతో సామాన్యులు వాటిని కొనేందుకు ఇబ్బంది పడ్డారు. నెలల తరబడి ఉల్లి ధరలు అలాగే కొనసాగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 7న ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. జనవరి కల్లా ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించగా.. ఎగుమతులపై నిషేధం విధించిన రెండు వారాలకే ఉల్లి ధరలు దిగివచ్చాయి.
ప్రస్తుతం ఉల్లి ధరలు రెండు నెలల కిందటి ధరలతో పోలిస్తే సగానికి పడిపోయాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో ఉల్లి నాణ్యతను బట్టి రూ. 25 నుంచి రూ.30 పలుకుతుండగా.. రిటైల్ గా కిలో ఉల్లి రూ.35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉల్లిపాయల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఉల్లి ధరల తగ్గుదలతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలని గుజరాత్, మహారాష్ట్ర సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవకపోవడం, సాగు విస్తీర్ణం తగ్గడం, తెగుళ్ల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గింది. దీంతో మార్కెట్లో ఉల్లి కొరత కారణంగా ధరలు ఆకాశాన్నంటాయి.