Telugu Global
National

రైతు ఆదాయం డబుల్ కాదు డల్.. నాబార్డ్ నివేదిక కేంద్రానికి చెంపపెట్టు

పీఎం కిసాన్ పేరుతో కేంద్రం విదిలిస్తున్న ఆర్థిక సాయం కూడా వారికి ఏమాత్రం ఉపయోగపడటంలేదు. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడంతోపాటు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, పంట సేకరణలో కేంద్రం నిర్లక్ష్యం కూడా రైతు ఆదాయం పెరగకపోవడానికి ప్రధాన కారణాలుగా తేలాయి.

రైతు ఆదాయం డబుల్ కాదు డల్.. నాబార్డ్ నివేదిక కేంద్రానికి చెంపపెట్టు
X

రైతు ఆదాయం రెట్టింపవుతుందని, అయిందని కూడా కేంద్రం కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. కానీ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని నాబార్డ్ అలాంటిదేమీ లేదని తేల్చేసింది. రైతుల ఆదాయం డబుల్ కాదు కదా డల్ గా సాగుతోందని నివేదిక బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం రైతు కుటుంబం నెలవారీ సగటు ఆదాయం 2012-13లో రూ.6,426 ఉంటే 2018-19 నాటికి రూ.10,084కి చేరింది. ఆదాయం వార్షిక వృద్ధి రేటు మాత్రం 2.5 శాతమేనని తెలిపింది. 2022 పూర్తయ్యే నాటికి కూడా ఈ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులేదని స్పష్టం చేసింది నాబార్డ్. రైతు ఆదాయంలో అభివృద్ధి మరీ స్వల్పం అని తేల్చేసింది. ఇలాంటి వృద్ధితో రైతు ఆదాయం రెట్టింపవ్వాలన్నే కల తీరదని కుండబద్దలు కొట్టింది.

సన్నచిన్నకారు రైతుల ఆదాయం మరీ స్వల్పం..

కమతాలు పెద్దవిగా ఉన్న రైతుల ఆదాయం కాస్తో కూస్తో మెరుగ్గా ఉందని.. సన్న చిన్నకారు రైతుల ఆదాయంలో ఏమాత్రం పెరుగుదల లేదని స్పష్టం చేసింది నాబార్డ్. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెప్పింది. అంటే పీఎం కిసాన్ పేరుతో కేంద్రం విదిలిస్తున్న ఆర్థిక సాయం కూడా వారికి ఏమాత్రం ఉపయోగపడటంలేదు. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడంతోపాటు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, పంట సేకరణలో కేంద్రం నిర్లక్ష్యం కూడా రైతు ఆదాయం పెరగకపోవడానికి ప్రధాన కారణాలుగా తేలాయి.

పాడిపశువులే ఆదరువు..

ఎక్కువ విస్తీర్ణంలో భూమి కలిగిన పెద్ద రైతులకు వచ్చే ఆదాయంలో 91 శాతం పంటల ద్వారానే లభిస్తుండగా, తక్కువ భూమి కలిగిన రైతు కుటుంబ ఆదాయంలో పంటల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 28 శాతమే. పాడి పశువుల పెంపకంపై వచ్చే సొమ్ము రైతు కుటుంబ ఆదాయంలో 2002-03లో 4 శాతం ఉండగా.. 2018-19 నాటికి 16 శాతానికి పెరగడం విశేషం. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్రం నిర్ణయించినా ఆ కల నెరవేరడానికి అవసరమైనంత ఆదాయ వృద్ధి రేటు లేదని నాబార్డు స్పష్టం చేసింది.

రైతుల విషయంలో మోసం..

రైతుల పేరు చెప్పి కేంద్రం చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని నాబార్డు నివేదిక స్పష్టం చేస్తోంది. మోదీ హయాంలో రైతుల జీవితాలు ఏమాత్రం సంతోషంగా లేవని నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. రైతుల జీవన విధానం మారాలంటే, అన్నదాతలు సంతోషంగా ఉండాలంటే కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పడాలి. రైతుల కష్టాలు తెలిసిన నాయకత్వం అధికారంలోకి రావాలి. అది జరిగే వరకు.. రైతులు కేవలం ఓటర్లుగానే పార్టీలకు కనిపిస్తుంటారు.

First Published:  24 Jan 2023 5:57 AM IST
Next Story