కేంద్రానికి వ్యతిరేకంగా మళ్ళీ రోడ్డెక్కిన రైతులు... స్తంభించిన ఢిల్లీ హర్యాణా హైవే
రైతుల రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం, ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలనే డిమాండ్లతో రైతులు మళ్ళీ ఉద్యమం ప్రారంభించారు. హర్యాణా, పంజాబ్ నుండి వేలాదిగా రైతులు శనివారం నాడు హర్యాణా లోని బహదూర్‌ఘర్ కు చేరుకొని అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరి ఆదివారం ఢిల్లీ , టిక్రీ సరిహద్దు వద్దకు చేరుకున్నారు.
రైతు వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా ఉద్యమించిన రైతన్నలు మళ్ళీ రోడ్డెక్కారు. చట్టాలను రద్దు చేస్తూ రైతుల డిమాండ్లను ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యలను కనీసం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్న రైతులు మళ్ళీ ఉద్యమం మొదలు పెట్టారు.
రైతుల రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం, ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలనే డిమాండ్లతో రైతులు నవంబర్ 28 న పంజాబ్ లోని హుస్సేనివాలా నుండి మళ్ళీ ఉద్యమం ప్రారంభించారు. హర్యాణా, పంజాబ్ నుండి వేలాదిగా రైతులు శనివారం నాడు హర్యాణా లోని బహదూర్‌ఘర్ కు చేరుకొని అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరి ఆదివారం ఢిల్లీ , టిక్రీ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. రైతులు టిక్రీ బార్డర్ లో ఢిల్లీ, హర్యాణా హైవేపై కూర్చోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
రైతులు తమ ఆందోళనలు విరమించి ఇవాల్టికి ఏడాది అయింది. దీనిని పురస్కరించుకుని హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు "మషాల్(జ్యోతులు) యాత్ర" పేరుతో ఈ పాద యాత్ర చేపట్టారు.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు టిక్రీ బార్డర్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తమకు ఢిల్లీలోకి ప్రవేశించే ఆలోచన లేదని రైతులు ప్రకటించారు. రైతులు సంవత్సరం పాటు ఉద్యమం నిర్వహించిన మూడు స్థలాల్లో టిక్రీ బార్డర్ కూడా ఒకటి.
''తాము నిరసనలుముగించి ఏడాది గడిచింది. కానీ ప్రభుత్వం వాగ్దానం చేసినట్టు ఎటువంటి MSP చట్టాలను రూపొందించలేదు. ఎన్ని నిరసనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. త్వరలో హర్యాణా శాసన సభను ఘెరావ్ చేస్తాం. మా మషాల్ యాత్ర విజయవంతం అయ్యింది. యాత్ర సందర్భంగా గ్రామాల్లో ప్రజలు మాకు గొప్పగా స్వాగతం పలికారు. వారి హక్కుల గురించి రైతులు చాలా పట్టుదలగా ఉన్నారు. '' అని ఈసందర్భంగా కిసాన్ సంఘర్ష్ సమితి (పగిడి సంభాల్ జట్టా) అధ్యక్షుడు మన్‌దీప్ నత్వా అన్నారు.
ఆదివారంనాటి పాదయాత్ర కోసం రైతులు నవంబర్ 28 నుండి గ్రామస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ 13 రోజుల్లో దాదాపు 170 బహిరంగ సభలు నిర్వహించినట్టు రైతు నాయకులు తెలిపారు. MSPపై చట్టపరమైన హామీ, రైతులకున్న భారీ అప్పులు, యూరియా దొరకకపోవడం, ఎరువుల అధికరేట్లు, ప్రైవేటీకరణ తదితర అంశాలపై ఈ సభల్లో రైతులు చర్చించినట్టు రైతు నాయకుడు వికాస్ సిసార్ తెలిపారు.
మరో వైపు ఆదివారం నాడు హర్యాణా సోనిపట్‌లోని రాజీవ్‌గాంధీ ఎడ్యుకేషన్ సిటీ వద్ద కిసాన్ పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో ఎంఎస్‌పీ గ్యారెంటీతోపాటు ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతు నాయకులు మరోసారి డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కేంద్రంలోని బీజేపీ నాయకుల పద్దతి ఇలాగే కొనసాగితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని రైతులు హెచ్చరించారు.