Telugu Global
National

'విజయ్ అన్నా రాజకీయాల్లోకి రా..' తమిళనాట వెలసిన పోస్టర్లు

ఇవాళ విజయ్ జన్మదినం. ఈ సందర్భంగా కోయంబత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజయ్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ పెద్ద సంఖ్యలో బ్యానర్లు వెలిశాయి.

విజయ్ అన్నా రాజకీయాల్లోకి రా.. తమిళనాట వెలసిన పోస్టర్లు
X

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి స్టార్డం ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్. తమిళనాడులో సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంజీఆర్, జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులయ్యారు. కరుణానిధికి కూడా సినీ నేపథ్యం ఉంది. కాగా, ఈ తరం అగ్ర హీరో అయిన విజయ్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

విజయ్ తాను నటిస్తున్న సినిమాల్లో తరచూ రాజకీయాల ప్రస్తావన తెస్తున్నారు. ఇటీవల విజయ్ తమిళనాడులో 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రోత్సాహక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నోటు తీసుకోకుండా ఓటు వేయాలని విద్యార్థులకు విజయ్ పిలుపు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అని, అందుకే వరుసగా విద్యార్థులతో ఆయన సమావేశం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా ఇవాళ విజయ్ జన్మదినం. ఈ సందర్భంగా కోయంబత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజయ్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ పెద్ద సంఖ్యలో బ్యానర్లు వెలిశాయి. ముఖ్యంగా కోయంబత్తూరు పట్టణంలో చాలాచోట్ల ఫ్యాన్స్ బ్యానర్లు కట్టారు. ఆ పోస్టర్లలో `అన్నా.. రాజకీయాల్లోకి వచ్చి ఉచిత విద్య అందించు..` అంటూ ఫ్యాన్స్ కోరారు. విజయ్ ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఆయన ఫ్యాన్స్ రాష్ట్రవ్యాప్తంగా బ్యానర్లు కట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. తమిళనాట ప్రాంతీయ పార్టీలదే మొదట్నుంచి ఆధిపత్యం. జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రంలో స్థానం లేదు. చాలా ఏళ్ల నుంచి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యే రాజకీయ పోరు సాగుతోంది. కాగా జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేకు నాయకత్వ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన తరుణం అని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

First Published:  22 Jun 2023 10:36 AM IST
Next Story