నకిలీ సిబిఐ అధికారి అరెస్టు
నిందితుడు తన మొబైల్ ఫోన్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌లో సిబిఐ, ఐపీఎస్ లోగోను ఉంచినట్లు విచారణలో తేలింది. నకిలీ ఐపీఎస్ ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డులు, కారుతో సహా పలు కీలక పత్రాలు, వస్తువులను సిబిఐ స్వాధీనం చేసుకుంది.
ఇటీవల దేశవ్యాప్తంగా సిబిఐ దాడులు, ఈడీ దాడులు అంటూ వార్తల్లో వినబడుతోంది. సరిగ్గా ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకోవాలని నకిలీ సిబిఐ అధికారి అవతారమెత్తాడు ఓ వైజాగ్ వాసి. ఈ నకిలీ సిబిఐ అధికారిని ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితుడు తనను తాను సిబిఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌గా, రిటైర్డ్ ఐపిఎస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడని విచారణలో తేలింది.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొమిరెడ్డి శ్రీనివాస్ అని వ్యక్తే ఈ నకిలీ సిబిఐ అధికారి అని సిబిఐ వర్గాలు తెలిపాయి. నిందితుడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగంలో మంచి పట్టు ఉందని, సిబిఐ పేరుతో అతను కోట్ల రూపాయల డీల్‌లు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా సిబిఐ దృష్టి సారించింది. తమిళనాడులో ఒక డీల్‌కు సంబంధించి నకిలీ అధికారి చేసిన సంభాషణ, డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చినవారు సిబిఐకి సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడి ఆచూకీ కోసం సిబిఐ బృందం ఆదివారం రాత్రి ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో మూడో అంతస్తులో ఉన్న మరో వ్యక్తితో నిందితుడు మొబైల్ ద్వారా మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్‌ను అతని మొబైల్ ఫోన్‌ను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన మొబైల్ ఫోన్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌లో సిబిఐ, ఐపీఎస్ లోగోను ఉంచినట్లు విచారణలో తేలింది. నకిలీ ఐపీఎస్ ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డులు, కారుతో సహా పలు కీలక పత్రాలు, వస్తువులను సిబిఐ స్వాధీనం చేసుకుంది.