Telugu Global
National

పేపర్ లీకేజీలో గుజరాత్ ఘనత.. ఆ రికార్డ్ ఎవరూ చెరపలేరు

దేశంలో పేపర్ లీకేజీ వ్యవహారం అంటేనే గుజరాత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది డిగ్రీ సర్టిఫికెట్ చూపించడం ఇష్టంలేని ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, గతంలో ఆయన ఏలుబడిలో ఉన్న రాష్ట్రం, ఇప్పటికీ బీజేపీ చేతుల్లోనే ఉన్న రాష్ట్రం కావడం విశేషం.

పేపర్ లీకేజీలో గుజరాత్ ఘనత.. ఆ రికార్డ్ ఎవరూ చెరపలేరు
X

ఇటీవల TSPSC నిర్వహించిన పోటీ పరీక్షల పేపర్లు ముందుగానే బయటకు రావడంతో తెలంగాణలో గందరగోళం నెలకొంది. లీకు వీరుల్ని పోలీసులు పట్టుకున్నారు. పగడ్బందీగా భవిష్యత్ పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు యువతను రెచ్చగొట్టి నానా హంగామా చేస్తున్నాయి. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంలో గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూస్తే.. TSPSC వ్యవహారం ఎంత చిన్నదో అర్థమవుతుంది.

పేపర్ లీకేజీకి పెట్టింది పేరు గుజరాత్..

పోటీ పరీక్షల ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేయాలి, ఆ తర్వాత ఎలా దాన్ని సర్కులేట్ చేయాలి, ఎవరితో పరీక్షలు రాయించాలి.. ఇలాంటివాటన్నిటికీ ఓ కేస్ స్టడీ లాంటిది గుజరాత్. అవును, గుజరాత్ లో అక్రమార్కులు పేపర్ లీకేజీతో సరిపెట్టుకోవడంలేదు. అభ్యర్థుల బదులు మరొకరితో పోటీ పరీక్షలు రాయిస్తారు, అక్కడ కుదరకపోతే పేపర్లు దిద్దే దగ్గర మేనేజ్ చేస్తారు. ఇంత చేస్తున్నారంటే.. ప్రభుత్వంలో వారికి ఎంత పలుకుబడి ఉంటుందో.. అని అనుకోవద్దు. ఎందుకంటే లీకు వీరులంతా నేరుగా ప్రభుత్వానికి చెందినవారే. ఇప్పటికే గుజరాత్ లో పోటీ పరీక్షల బోర్డ్ లన్నిటిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు తిష్టవేశారు. గత 10ఏళ్లుగా జరుగుతున్న రిక్రూట్ మెంట్లన్నిటినీ వీరు భ్రష్టుపట్టించారు. అసమర్థులను అందలమెక్కించారు. గుజరాత్ లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అంగడి సరుకు అనే పేరు పడిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగి అంటే.. పోస్ట్ ఎంతకు కొన్నారు అనే ప్రశ్న అక్కడ కామన్ గా వినపడుతుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సభ్యులే రిక్రూట్ మెంట్ బోర్డుల్లో చేరిపోయి అవకతవకలకు తెరతీశారు.

గుజరాత్ లో ఇటీవల భావ్ నగర్ పోలీసులు పేపర్ లీకేజీ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 36మందిని దోషులుగా తేల్చారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురిలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు. వీరంతా అసలు అభ్యర్థి బదులు పరీక్షలు రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లారు. ఎంచక్కా పరీక్షలు రాసి వచ్చేశారు. ఆ తర్వాత విషయం బయటపడటంతో ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లారు.

ప్రభుత్వ ఉద్యోగం రూ.10లక్షలే..

పేపర్ లీక్ చేయడం, దానికి ఆన్సర్లు తయారు చేయడం, వాటిని బట్టీపట్టి పరీక్ష హాల్ కి వెళ్లి పేపర్ నింపడం.. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు కొత్త ట్రెండ్ అభ్యర్థుల్ని మార్చేయడం. పరీక్షకు అప్లికేషన్ పెట్టుకుని హాల్ టికెట్ తెచ్చుకుంటే చాలు, ఆ తర్వాత పోస్ట్ ని బట్టి 5 లక్షలనుంచి 10 లక్షల వరకు సమర్పించుకుంటే మనకు సూటయ్యే అభ్యర్థిని అక్రమార్కులు వెదికిపెడతారు. వారితో పరీక్ష రాయిస్తారు. ఇలా అసలు అభ్యర్థుల బదులు పరీక్షలు రాసే డమ్మీ అభ్యర్థులు చాలామంది, ప్రభుత్వ ఉద్యోగులే కావడం విశేషం. వారి మేథస్సుని ఉపయోగించి ఇలా అడ్డదారుల్లో సంపాదిస్తున్నారు. డమ్మీ అభ్యర్థులు పరీక్ష రాసినందుకు 25వేల రూపాయల వరకు చార్జ్ చేస్తారు. ఇన్విజిలేటర్ ని మేనేజ్ చేయడంతోపాటు మిగతా వ్యవహారాలన్నీ డీల్ కుదుర్చుకున్నవారు చక్కబెట్టుకుంటారు. 2012లో భావ్ నగర్ లో ఈ తరహా రాకెట్ బయటపడింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా ఈ 11 ఏళ్ల కాలంలో గుజరాత్ లో పేపర్ లీకేజీ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

కఠిన చట్టాలతో ఉపయోగం ఉందా..?

గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్ -2023 బిల్లుని ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 10ఏళ్లు జైలుశిక్ష, గరిష్టంగా కోటి రూపాయల జరిమానా విధిస్తారు. ఇలాంటి చట్టాలతో అయినా అక్రమార్కుల్లో మార్పు వస్తుందేమోనని ఆశిస్తున్నారు. కానీ చట్టాలతో సరిపోదని, ముందు.. పోటీ పరీక్షల బోర్డుల్లో తిష్టవేసిన అక్రమార్కులను తొలగించాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తోంది.

విచిత్రం ఏంటంటే.. ఇలాంటి చట్టాలు వచ్చిన తర్వాత కూడా గుజరాత్ లో పేపర్ లీకేజీలు ఆగలేదు. రెండు వారాల క్రితం భావ్ నగర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ ప్రశ్నాపత్రం లీకైంది. ఇన్ చార్జ్ ప్రిన్సిపల్ సహా ఇద్దరు విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో పేపర్ లీకేజీ వ్యవహారం అంటేనే గుజరాత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది డిగ్రీ సర్టిఫికెట్ చూపించడం ఇష్టంలేని ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, గతంలో ఆయన ఏలుబడిలో ఉన్న రాష్ట్రం, ఇప్పటికీ బీజేపీ చేతుల్లోనే ఉన్న రాష్ట్రం కావడం విశేషం.

First Published:  20 April 2023 10:22 AM IST
Next Story