Telugu Global
National

'న్యాయమంత్రిగారూ, కోర్టు నిర్ణయాన్ని అంగీకరించడం తమ‌ విధి'

న్యాయవ్యవస్థపై రిజిజు బహిరంగ వ్యాఖ్యలను తప్పుబట్టిన‌ నారిమన్, న్యాయస్థానం తీర్పులను సరియైనవా, కాదా అనే వాటితో సంబంధం లేకుండా అంగీకరించడం తమ ప్రాథమిక‌ కర్తవ్యం అని న్యాయ మంత్రికి గుర్తు చేశారు.

న్యాయమంత్రిగారూ, కోర్టు నిర్ణయాన్ని అంగీకరించడం తమ‌ విధి
X

సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థపై కేంద్రం నుండి దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, 2021 ఆగస్టులో పదవీ విరమణ చేయడానికి ముందు స్వయంగా కొలీజియంలో భాగస్తుడైన‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలీ నారిమన్ తీవ్రంగా స్పందించారు.

శుక్రవారం ముంబైలో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో ఆయన న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజుపై విరుచుకపడ్డారు. న్యాయవ్యవస్థపై రిజిజు బహిరంగ వ్యాఖ్యలను తప్పుబట్టిన‌ నారిమన్, న్యాయస్థానం తీర్పులను సరియైనవా, కాదా అనే వాటితో సంబంధం లేకుండా అంగీకరించడం తమ ప్రాథమిక‌ కర్తవ్యం అని న్యాయ మంత్రికి గుర్తు చేశారు. పరోక్షంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్‌ను కూడా నారిమన్ విమర్శించారు. ఇది రాజ్యాంగం రూపొందించిన ప్రాథమిక నిర్మాణం అని ఆయన అన్నారు.

కొలీజియం సిఫారసు చేసిన పేర్లను కేంద్రం పెండింగ్ లో పెట్టడంపై, ఇదిప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అని ఆయన అన్నారు. కొలీజియం సిఫార్సులపై ప్రభుత్వం స్పందించడానికి 30 రోజుల గడువుండాలని ఆయన‌ సూచించారు ప్రభుత్వం నిర్ణీత గడువులోగా స్పందించకుంటే.. అటోమెటిక్ గా ఆ ప్రతిపాదన అమలులోకి వచ్చినట్టే పరిగణించాలన్నారు.

"ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా న్యాయ మంత్రి చేసిన వ్యాఖ్యను నేను విన్నాను. న్యాయ మంత్రికి రెండు ప్రాథమిక రాజ్యాంగ ప్రాథమిక అంశాలు ఉన్నాయని నేను చెప్పదల్చుకున్నాను. ఒక ప్రాథమిక విషయం ఏమిటంటే, USA వలె కాకుండా, ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం కనీసం ఐదుగురు న్యాయమూర్తులు ఎంపిక చేయబడతారు. ఆ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది రాజ్యాంగం ప్రకారం తీర్పు ఇచ్చిన తర్వాత ఆర్టికల్ 144 ప్రకారం ఆ తీర్పుకు మీరు కట్టుబడి తీరాలి. అయితే ఆ తీర్పును మీరైనా, ఒక పౌరుడిగా నేనైనా విమర్శించవచ్చు. కానీ మీరైనా నేనైనా భారత పౌరులుగా ఆ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే." అని నారిమన్ అన్నారు.

''ఈ ప్రాథమిక నిర్మాణ సిద్దాంతాన్ని ఇప్పటివరకు రెండు సార్లు సవాల్ చేశారు. ఆ రెండు సార్లూ ఓడిపోయారు. ఆ తర్వాత ఈ 40 ఏళ్ళలో మళ్ళీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు.'' అని నారిమన్ తెలిపారు.

" మీరు మీ కోసం ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారని గుర్తుంచుకోవడం ముఖ్యం, కానీ దాని క్రింద ఉన్న సంస్థలు తప్పని మీకనిపిస్తే చివరికి రాజ్యాంగాన్ని రద్దు చేయాలి తప్ప అంతకు మించి చేయగలిగిందేమీ లేదు " అని నారిమన్ స్పష్టం చేశారు.

First Published:  28 Jan 2023 5:47 PM IST
Next Story