మాజీ ప్రధానులు ఎవరూ లేకుండానే జీ20 విందు
దేశానికి ఇప్పటి వరకు 15 మంది ప్రధాన మంత్రులుగా సేవలందించారు. వీరిలో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 15వ వారు. కాగా 14 మంది మాజీ ప్రధానమంత్రుల్లో ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారు.
అగ్రరాజ్యాలన్నీ భారతదేశ రాజధాని ఢిల్లీ వైపు చూస్తున్నాయి. జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా విదేశాల నుంచి అతిరథ మహారథులంతా తరలివస్తున్నారు. తొలిరోజు సమావేశం తర్వాత వచ్చిన అతిథులందరికీ మన దేశం తరఫున ప్రభుత్వం ఘనంగా విందు ఇవ్వబోతోంది. దీనికి ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మాజీ ప్రధానమంత్రులకూ ఆహ్వానం అందించారు.
ఆరోగ్య సమస్యలతో రాలేమన్న మన్మోహన్, దేవెగౌడ
మాజీ ప్రధానమంత్రులు హెచ్‌డీ దేవెగౌడ, మన్మోహన్ సింగ్‌లకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఈ విందుకు తాము హాజరుకాలేకపోతున్నామని వారు వర్తమానం పంపారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో దేవెగౌడ అతికష్టం మీద అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయనలాగే 90 ఏళ్ల వయసున్న మన్మోహన్‌సింగ్ కూడా వయసుతో వచ్చే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
మాజీ ప్రధానులు ఎవరూ లేనట్లే!
దేశానికి ఇప్పటి వరకు 15 మంది ప్రధాన మంత్రులుగా సేవలందించారు. వీరిలో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 15వ వారు. కాగా 14 మంది మాజీ ప్రధానమంత్రుల్లో ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారు. వారు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ మాత్రమే. వారిద్దరు కూడా హాజరుకాలేమని చెప్పడంతో దేశంలో జరుగుతున్న అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమంలో మన మాజీ ప్రధానులెవరూ లేనట్లే అయింది.