Telugu Global
National

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.... ఆయనపై కేసు కొట్టివేసిన హైకోర్టు

మావోయిస్టు కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాని ముంబై హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్దోషిగా విడుదల చేసింది. శారీరక వైకల్యం కారణంగా చక్రాల కుర్చీలో ఉన్న సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి....  ఆయనపై కేసు కొట్టివేసిన హైకోర్టు
X

మావోయిస్టు సంబంధాల ఆరోపణలపై శిక్ష పడ్డ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిబాబా పై కేసును బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టేసింది. ఆయనను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. శారీరక వైకల్యం కారణంగా చక్రాల కుర్చీలో ఉన్న సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

2017లో ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది.

ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. దోషులు మరే ఇతర కేసులో నిందితులుగా లేనట్ల‌యితే వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

మార్చి 2017లో, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు సాయిబాబా, ఇతర వ్యక్తులను దోషులుగా ప్రకటించింది, అందులో ఒక పాత్రికేయుడు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి కూడా ఉన్నారు. వీరంతా మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని,దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA). భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని వివిధ నిబంధనల ప్రకారం వీరిని గడ్చిరోలి కోర్టు దోషులుగా నిర్ధారించింది.

అయితే గడ్చిరోలి కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసి, సాయిబాబా తో సహా ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.

First Published:  14 Oct 2022 11:54 AM IST
Next Story