Telugu Global
National

బీజేపీకి ఓటేయమని నేను చెప్పను.. మాజీ సీఎం ఉమాభారతి

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న లోధి సామాజిక వర్గానికి చెందిన వారిని ఉద్దేశించి ఉమా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి ఓటేయమని నేను చెప్పను.. మాజీ సీఎం ఉమాభారతి
X

బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ఎప్పుడూ బీజేపీకి ఓటేయమని ప్రజలను కోరబోనని, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం అవసరం లేదని అన్నారు. మీకు ఇష్టం వచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న లోధి సామాజిక వర్గానికి చెందిన వారిని ఉద్దేశించి ఉమా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను లోధి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అయినప్పటికీ.. తమ కులంలోని వాళ్లందరూ బీజేపీకే ఓటేయాలని తాను ఎన్నడూ కోరనని స్పష్టం చేశారు. భోపాల్‌లోని మానస్‌భవన్‌లో నిర్వహించిన లోధి యువతీ, యువకుల పరిచయ సమ్మేళన కార్యక్రమానికి ఉమా భారతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 'నేను మిమ్నల్ని బీజేపీకి ఓటేయాలని కోరను. మీ అభిరుచులకు అనుగుణంగా నిర్ణయించుకోండి. నాకు సంబంధించినంత వరకు రాజకీయం బంధం నుంచి మీరు ఇక విముక్తి పొందారు' అని భావోద్వేగంగా మాట్లాడారు.

ఉమాభారతి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ నాయకుల్లో కలవరం మొదలైంది. బీజేపీకి మొదటి నుంచి హార్డ్ కోర్ నాయకురాలిగా ఉన్న ఉమాభారతి స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీపై ప్రభావం పడుతుందని అంటున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీ బలోపేతానికి ఉమా భారతి నాయకత్వమే కారణమని బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. లోధి సామాజిక వర్గానికి ఆమె చెప్పిందే వేదవాక్కుగా ఉంటుందని.. ఉమా భారతి ఏం చెబితే వాళ్లు ఆ పార్టీకి ఓటేస్తారని అంటున్నారు.

ఇటీవల కాలంలో పార్టీ పరంగా కూడా పెద్దగా కార్యక్రమాల్లో ఉమాభారతి పాల్గొనడం లేదు. తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె సన్నిహితుల వద్ద బాధపడుతున్నట్లు సమాచారం. మోడీ, షాలు వచ్చిన తర్వాత సీనియర్ నాయకులను నెమ్మదిగా పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఉమా భారతి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

First Published:  29 Dec 2022 2:57 AM GMT
Next Story