కాంగ్రెస్ హయాంలో జైల్లో ఉన్నా : అమిత్ షా
కాంగ్రెస్ హయాంలో తాను ఏడు రోజుల పాటు జైలు జీవితం గడిపానని, దెబ్బలు తిన్నాని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.

కాంగ్రెస్ హయాంలో తాను ఏడు రోజుల పాటు జైలు జీవితం గడిపానని, దెబ్బలు తిన్నాని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా నిర్బంధాలను ఎదుర్కొన్నానని తెలిపారు.విద్యార్థిగా ఉన్నప్పుడు నిర్వహించిన ఆందోళన కారణంగా తనని జైల్లో పెట్టారని, తనపట్ల కఠినంగా వ్యవహరించారని పేర్కొన్నారు. డెర్గావ్‌లోని లచిత్ బర్ఫుకాన్ పోలీసు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా తన విద్యార్థి జీవితాన్ని కేంద్రమంత్రి గుర్తు చేసుకున్నారు.‘
అస్సాంలో హితేశ్వర్ సైకియా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఆందోళన నిర్వహించాం. అప్పట్లో నన్ను 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. నా పట్ల కఠినంగా వ్యవహరించారు. నాపై భౌతికంగా దాడి చేశారు కూడా’’ అని అమిత్ షా అన్నారు. సైకియా అస్సాంకు కాంగ్రెస్ తరఫున రెండు పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అస్సాంలో శాంతికి ఏమాత్రం కృషి చేయలేదని అమిత్ షా దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయని చెప్పారు. 10 వేల మంది యువత ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు. ఈ పోలీసు అకాడమీకి లచినత్ బర్ఫుకన్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు.