మహిళా బిల్లు పాసై చట్టంగా మారినా.. ఇప్పట్లో అమలు జరిగేది కష్టమే.. కారణం ఇదే!
మహిళా బిల్లుకు 2023లోనే మోక్షం కలిగినా.. దాన్ని 2024 ఎన్నికల్లో అమలు చేసే అవకాశం లేదు.

పాత పార్లమెంట్ భవనంలో లోక్‌సభ సమావేశాల చిట్ట చివరి సెషన్ ముగిసిన వెంటనే ఒక వార్త బయటకు వచ్చింది. మహిళా బిల్లును మోడీ ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్నదనేది ఆ వార్త సారాంశం. దాన్ని నిజం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌లో మహిళా బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ బిల్లు ఇరు సభల్లో పాస్ అయి.. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే చట్టరూపం దాలుస్తుంది. ఆ తర్వాత చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వర్తింప చేస్తారు. ఇప్పటికిప్పుడు మహిళా బిల్లు చట్టరూపం దాల్చినా దాన్ని వెంటనే అమలు చేసే అవకాశం లేదు.
మహిళా బిల్లుకు 2023లోనే మోక్షం కలిగినా.. దాన్ని 2024 ఎన్నికల్లో అమలు చేసే అవకాశం లేదు. మహిళా బిల్లును అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముగియాల్సి ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉన్నది. 2026లోనే అందుకు సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై గతంలోనే స్పష్టతనిచ్చింది. 2026లో పునర్విభజన ప్రారంభమైతే.. కొత్త నియోజకవర్గాలు 2029లో గానీ అమలులోకి రావు. అంటే 2029 సార్వత్రిక ఎన్నికల్లో గానీ మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.
నియోజకవర్గాల పునర్విభజన చేసే సమయంలోనే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల గుర్తింపుతో పాటు మహిళా రిజర్వేషన్లు ఉండే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తిస్తారు. ప్రతీ రాష్ట్రంలో 33 శాతం అసెంబ్లీ, లోక్‌సభ సీట్లతో పాటు ఎస్సీ, ఎస్టీల సీట్లు కూడా ఉండేలా పునర్విభజన చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా మహిళల కోటా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత భారీ ప్రక్రియ ఉన్నందువల్లే మహిళా రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు అమలు కాబోవని.. దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ఏపీ, తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. తెలంగాణలో 119 నుంచి 153, ఏపీలో 175 నుంచి 225 నియోజకవర్గాలు అవుతాయి. తెలంగాణలో 153 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 శాతం అంటే దాదాపు 50 సీట్లు, ఏపీలో 225 నియోజకవర్గాల్లో దాదాపు 75 సీట్లు మహిళలకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక విధంగా చూసుకుంటే చట్ట సభల్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టే ఇన్నాళ్లూ ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికే చాలా ప్రభుత్వాలు ప్రయత్నించి విఫలం అయ్యాయి. తొలి సారిగా 1996 హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ సర్కార్లు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినా ఆమోదానికి నోచుకోలేదు. మరిప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.