Telugu Global
National

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు....నన్ను చంపినా లొంగిపోనన్న రౌత్

శివసేన ఎంపీ, ఉద్దవ్ ఠాక్రే సన్నిహితుడైన సంజయ్ రౌత్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. అయితే ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమే అని రౌత్ ఆరోపించారు.

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు....నన్ను చంపినా లొంగిపోనన్న రౌత్
X

మనీలాండరింగ్ కేసులో ముంబై లోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ఇంటిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తున్నారు.

ముంబై 'చాల్' రీ-డెవలప్‌మెంట్‌లో అవకతవకలు, అతని భార్య, 'అసోసియేట్'లకు సంబంధించిన ఇతర‌ లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రౌత్‌ను ED విచారణకు పిలిచింది.

జూలై 20, జూలై 27న రెండుసార్లు సమన్లు ​​ఇచ్చినప్పటికీ సంజయ్ రౌత్ ED విచారణకు హాజరుకానందున ఈ రోజు ఆయన ఇంట్లో సోదాలు చేయాల్సి వచ్చిందని ED అధికారులు చెప్తున్నారు. సంజయ్ రౌత్ శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు. తానెలాంటి తప్పు చేయలేదని రాజకీయ కక్ష సాధింపులో బాగంగానే తనను టార్గెట్ చేస్తున్నారని రౌత్ ఆరోపించారు.

"నాకు ఎలాంటి స్కామ్‌తో సంబంధం లేదు. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే మీద‌ ప్రమాణం చేసి చెప్తున్నాను. బాలాసాహెబ్ పోరాడటం మాకు నేర్పించారు. నేను శివసేన కోసం పోరాడుతూనే ఉంటాను" అని ఆయన ఈ ఉదయం ట్వీట్ చేశారు. ఇవన్నీతప్పుడు చర్యలు .. తప్పుడు సాక్ష్యాలతో చేస్తున్న దాడులు.. అయినా సరే శివసేనను వదిలి వెళ్ళేది లేదు.. చచ్చినా లొంగిపోను.. జై మహారాష్ట్ర'' అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి జూలై 1న సంజయ్ రౌత్ ను ఈడీ ప్రశ్నించింది. జూలై 20న మళ్లీ హాజరు కావాల్సిందిగా ఆయనకు సమన్లు ​​అందాయి, అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల వల్ల హాజరు కాలేనని ఆయన చెప్పారు. ఆ తర్వాత జూలై 27న హాజరుకావాలని కోరినప్పటికీ ఆయన హాజరుకాలేదు.

శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసినప్పుడు సంజయ్ రౌత్ ఉద్దవ్ ఠాక్రే వైపు నిలబడ్డారు. అప్పటి నుంచి బీజేపీ తనను టార్గెట్ చేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు.

జూన్ 28న సంజయ్ రౌత్ కు సమన్లు ​​వచ్చినప్పుడు, "ఈడీ నన్ను పిలిచిందని నాకు ఇప్పుడే తెలిసింది. మహారాష్ట్రలో పెద్ద రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మేము , బాలాసాహెబ్ యొక్క శివసైనికులం, ప్రస్తుతం అతి పెద్ద యుద్ధం చేస్తున్నాము, ఇది నన్ను యుద్దం చేయకుండా ఆపడానికి జరిగిన కుట్ర, మీరు నా తల నరికినా, నేను గౌహతి మార్గంలో వెళ్ళను, నన్ను అరెస్టు చేయండి! జై హింద్!" అని ట్వీట్ చేశారు.

First Published:  31 July 2022 12:36 PM IST
Next Story