Telugu Global
National

భారత్ లో భారీగా పెరగబోతున్న మందుల ధరలు..

చైనాలోని ఏపీఐ యూనిట్లలో తయారీ, సరఫరా వ్యవస్థల్లో అంతరాయం కారణంగా వాటి ధరలు 20శాతం మేర పెరిగాయి. దీంతో అజిత్రోమైసిన్‌, పారాసెట్మాల్, అమాక్సిసిలిన్ వంటి ఔషధాల ధరలు పెరిగే అవకాశముంది.

భారత్ లో భారీగా పెరగబోతున్న మందుల ధరలు..
X

మేకిన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్నా.. ఇంకా చైనాపై ఆధారపడాల్సిన అవస్థ భారత్ కి తప్పడంలేదు. ఇప్పుడు చైనా తుమ్మితే భారత్ కి ముక్కు ఊడిపోయే పరిస్థితి ఉంది. కరోనాతో చైనా అల్లకల్లోలం అవుతుంటే ఆ ప్రభావం భారత్ పై స్పష్టంగా కనపడుతోంది. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. ప్రాణాధార మందుల రేట్లు భారత్ లో భారీగా పెరగబోతున్నాయి. అసలు కొన్ని మందులకు కొరత ఏర్పడబోతోంది. ఎందుకంటే చైనా నుంచి రావాల్సిన యాక్టివ్ ఫార్మాసుటికల్ ఇంగ్రిడెంట్ల(ఏపీఐ) దిగుమతులు ఆగిపోతున్నాయి. చైనాలో లాక్ డౌన్ తరహా పరిస్థితులు ఉండటంతో దిగుమతులపై ప్రభావం స్పష్టంగా కనపడుతోంది.

ఏపీఐలు, ఇంటర్మీడియట్లు, ఇతర బల్క్ డ్రగ్ ల కోసం భారత్, చైనాపైనే ఆధారపడుతోంది. ఏపీఐల దిగుమతుల్లో దాదాపు 70శాతం చైనానుంచే వస్తున్నాయి. చైనాలోని ఏపీఐ యూనిట్లలో తయారీ, సరఫరా వ్యవస్థల్లో అంతరాయం కారణంగా వాటి ధరలు 20శాతం మేర పెరిగాయి. దీంతో అజిత్రోమైసిన్‌, పారాసెట్మాల్, అమాక్సిసిలిన్ వంటి ఔషధాల ధరలు కూడా పెరిగే అవకాశముంది. షుగర్ వ్యాధి నియంత్రణకు వాడే మెట్‌ ఫార్మిన్‌ సహా ఇతర ఔషధాల తయారీకి అవసరమైన ముడి ఔషధాలకోసం కూడా భారత కంపెనీలు చైనా పైనే ఆధారపడుతున్నాయి. ముడి సరకుల ధరలు పెరగడంతో ఆయా ట్యాబ్లెట్ల ధరలు కూడా పెరగబోతున్నాయి.

చైనా కట్టడి..

జీరో కొవిడ్ లక్ష్యంతో కొన్నాళ్లుగా చైనా ముడి ఔషధాల ఉత్పత్తిని కూడా తగ్గించేసింది. ఆ తర్వాత ఇప్పుడు చైనాలో కొవిడ్ విజృంభణతో ఎగుమతులను కూడా తగ్గించేస్తోంది. దేశీయ అవసరాలకు చైనా వాటిని వినియోగించుకుంటోంది. దీంతో భారత్ దిక్కులు చూడాల్సిన పరిస్థితి. దీర్ఘకాలంగా సరఫరాలో అంతరాయం ఏర్పడితే మాత్రం కీలకమైన యాంటీబయోటిక్స్‌, ఇతర ఔషధాలకు కొరత ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెంటరీ కంపెనీలు దాదాపు రెండు నెలలకు సరిపడా స్టాక్ ఉంచుకుంటాయి. అలాంటి కంపెనీలకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు.

First Published:  23 Dec 2022 9:19 AM IST
Next Story