ఏప్రిల్ నుంచి మరో షాక్.. ఔషధాల ధరల్లో భారీ పెరుగుదల
జాతీయ టోకు ధరల సూచీ ప్రకారం ప్రతి ఏడాదీ నేషనల్ ఫార్మాసుటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) ఔషధాల ధరల పెంపుని ప్రతిపాదిస్తుంది. ఈ ఏడాది 12.2 శాతం వరకు పెంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
బీజేపీ ప్రభుత్వం హయాంలో ఫలానా వస్తువు రేటు తగ్గింది అని చెప్పుకోడానికి ఒక్కటి కూడా కనపడదు, అలాగే రేట్ల పెరుగుదలలో మాత్రం ఒక్కో రంగం పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది ఫార్మా రంగం కూడా దూకుడుమీద ఉంది. ఏప్రిల్ 1 నుంచి ప్రజల నెత్తిన పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు వెయ్యి ఫార్ములాలకు సంబంధించిన 384 రకాల అత్యవసర మందుల ధరలు ఏప్రిల్-1నుంచి భారీగా పెరుగుతాయి. నొప్పుల మాత్రలు, గుండె వ్యాధులకి సంబంధించిన మాత్రలు, యాంటీబయోటిక్స్, గ్యాస్ ట్రబుల్, క్షయవ్యాధి నివారణ మాత్రలు... ఇలా అన్నిరకాల మందుల రేట్లు పెరుగుతాయి.
జాతీయ టోకు ధరల సూచీ ప్రకారం ప్రతి ఏడాదీ నేషనల్ ఫార్మాసుటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) ఔషధాల ధరల పెంపుని ప్రతిపాదిస్తుంది. ఈ ఏడాది 12.2 శాతం వరకు పెంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జనవరి నుంచి మందుల ధరలు పెంచాలని ఫార్మాసుటికల్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, దాని ప్రకారం మందుల ధరలు పెంచాలంటూ కేంద్రం అనుమతి తీసుకుని వడ్డింపు సిద్ధం చేసుకుంది NPPA.
వరుసగా మూడో ఏడాది మందుల ధరలు పెరుగుతున్నాయి. గతేడాది ధరల పెంపు స్వల్పంగానే ఉన్నా, ఈ ఏడాది మాత్రం భారీగా మోత మోగిపోతుందని తెలుస్తోంది. ధరల పెంపులో అన్ని అత్యవసర మందులు ఉండటంతో ఆ ప్రభావం సామాన్యులపై కచ్చితంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఓ కుటుంబం ప్రతి నెలా 5వేల రూపాయల మందులు కొనుగోలు చేస్తుంటే.. ఇకపై నెల నెలా వారిపై 610 రూపాయల అదనపు భారం పడుతుందనమాట. కచ్చితంగా ఈ భారం ఎక్కువేనని అంటున్నారు సామాన్యులు. ఫార్మాసుటికల్ కంపెనీల కోరిక మేరకు వారివైపే మొగ్గు చూపింది కేంద్రం.